ఫిలిం న్యూస్
 
 
 
 
వెంకటేశ్ బాలీవుడ్ తరహాలో కనిపించే ‘షాడో’

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘సింహా’లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన పరుచూరి కిరీటి ప్రస్తుతం మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మళ్లీ తమ బేనర్‌పై ఓ సంచలనాత్మక చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఈ రెండేళ్లల్లో పలు కథలు విన్న కిరీటి చివరికి ‘షాడో’ని సెలక్ట్ చేసుకున్నారు. ఎ యునెటైడ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్, శ్రీకాంత్ కాంబినేషన్‌లో ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది.

‘సంక్రాంతి’ చిత్రం తర్వాత మరోసారి వెంకటేశ్, శ్రీకాంత్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తాప్సీ, మధురిమ కథానాయికలు. హీరో, హీరోయిన్లపై తీసిన ముహూర్తపు దృశ్యానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఇది కమర్షియల్ ఎంటర్‌టైనర్. నా కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. శ్రీకాంత్ కూడా మంచి పాత్ర చేస్తున్నాడు.

ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ -‘‘కెరీర్ మొదలైన తక్కువ సమయంలోనే వెంకటేశ్‌లాంటి స్టార్ హీరోతో పనిచేయడం ఆనందంగా ఉంది. కథ రీత్యా ఈ చిత్రా టన్ని అధిక భాగం ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో చిత్రీకరిస్తాం. ముంబై, హైదరాబాద్‌లలో కూడా కొంత భాగాన్ని షూట్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘వెంకటేశ్ లుక్ బాలీవుడ్ తరహాలో ఉన్నా.. ఇది పరిపూర్ణమైన తెలుగు సినిమా.

మెహర్ రమేష్ తరహాలో స్టైలిష్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అని రచయిత కోన వెంకట్ చెప్పారు. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, మెహర్మ్రేష్, సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ప్రకాష్.