Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ఎన్టీఆర్ 'శక్తి'
      వైజయంతీ మూవీస్‌ సంస్థ ఎన్టీఆర్‌ కథానాయకుడుగా నిర్మిస్తున్న చిత్రం 'శక్తి'. ఇలియానా కథానాయిక. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. సి.అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతి సంస్థ ప్రారంభమై 35 సంవత్సరాలైన నేపథ్యంలో 'శక్తి' మొదలు కావడం విశేషం. ఎందుకంటే దివంగత ఎన్టీ రామారావుతోనే ఈ సంస్థ తొలి చిత్రంగా 'ఎదురులేని మనిషి'ని నిర్మించింది. ఇప్పుడు యువ ఎన్టీఆర్‌తో 'శక్తి' నిర్మిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కృష్ణంరాజు గౌరవ దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌ మాట్లాడుతూ ''సరిగ్గా 35యేళ్ల కిందట అన్న ఎన్టీఆర్‌ నామకరణం చేసి మా సంస్థను ప్రారంభించారు. అప్పట్నుంచి ఎన్నో చిత్రాలను నిర్మించాం. ఈ శుభ సందర్భంలో యువ కథానాయకుడు ఎన్టీఆర్‌తో చిత్రాన్ని ప్రారంభించాం. మూడో తరంతో కూడా చిత్రాలను నిర్మించడం అరుదైన విషయం. ఇన్నేళ్లుగా మా సంస్థను ప్రోత్సహిస్తూ వస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 'శక్తి' చిత్రానికి వ్యయం, కాల పరిమితి వంటి హద్దుల్లేవు. మాకు, మా సంస్థకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. మెహర్‌ రమేష్‌ ఆర్నెళ్లపాటు శ్రమించి స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. అందరికీ గుర్తుండిపోయేలా ఈ సినిమాను నిర్మిస్తున్నామ''న్నారు. దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ''నేను చేసిన మొదటి చిత్రం ఎన్టీఆర్‌తో కావడం నా అదృష్టమైతే, మరొకసారి వైజయంతీ మూవీస్‌లో అదే కాంబినేషన్‌తో చేయడం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తోంది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ మాత్రమే నిర్మించగలరు. ఎన్టీఆర్‌ మాత్రమే నటించగలరు. 'శక్తి' అనే పేరు ఎంత బలంగా ఉందో, సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుంది. ఎన్టీఆర్‌ ఖ్యాతిని రెట్టింపు చేసే చిత్రమిది. ఈ సినిమా నాకు మహాసంకల్పం లాంటిది. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో చిత్రాన్ని రూపొందించనున్నాం. ఫిబ్రవరి 6 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. జోథ్‌పూర్‌, రాజస్థాన్‌, కాశ్మీర్‌, హరిద్వార్‌, లడఖ్‌, హంపి, మైసూర్‌, లండన్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంద''న్నారు. ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, వి.వి.వినాయక్‌, శ్రీనువైట్ల, ఎస్వీకృష్ణారెడ్డి, అల్లు అరవింద్‌, కె.కోదండరామిరెడ్డి, కె.ఎల్‌.నారాయణ, నల్లమలుపు బుజ్జి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 'శక్తి'కి మాటలు: సత్యానంద్‌, ఛాయాగ్రాహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, కళ: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్‌, జె.కె.భారవి, తోట ప్రసాద్‌, డి.ఎస్‌.కన్నన్‌, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com