ఫిలిం న్యూస్
 
 
 
 
‘శిరిడి సాయి’గా నాగార్జున
అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలతో ప్రేక్షకుల్ని భక్తిసాగరంలో తేలియాడించిన అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు ద్వయం... త్వరలో ‘శిరిడిసాయి’ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఇందులో ‘సాయి’గా నాగార్జున నటించడం విశేషం. శిరిడీసాయి భక్తుడైన ప్రముఖ వ్యాపారవేత్త మహేశ్వరరెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా విశేషాలు తెలుపడానికి తొలిసారిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ-‘‘నేను చేసిన అన్నమమ్య, రామదాసు భక్తులు. ఇప్పుడు భగవంతుడిగా చేయబోతున్నాను. భయంగా ఉంది. ఈ పాత్ర చేయబోతున్నాను అనగానే... తెలియని వణుకు నాలో మొదలైంది. ఈ వేదికపై ఉన్నవారితో పోల్చుకుంటే.. బాబాతో నా పరిచయం తక్కువ. ఇప్పుడే ఆయన గురించి తెలుసుకుంటున్నాను. భారం మొత్తం శిరిడీ సాయినాధునిపై, దర్శకుడు కె.రాఘవేంద్రరావుపైనే వేస్తున్నాను’’ అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడారు.

ఈ చిత్ర కథకుడు భక్త సురేష్‌కుమార్ మాట్లాడుతూ -‘‘బాబా మహాసమాధి చెంది కేవలం 93 సంవత్సరాలే అయ్యింది. ఇంత తక్కువ సమయంలో యూనివర్సల్‌ గాడ్‌గా పూజలందుకుంటున్న దేవుడు ఆయన మాత్రమే. ప్రస్తుతం సాయి చింతన, సాయితత్వం విశ్వమంతా వ్యాపించివుంది. సకల పురాణాల సమ్మేళనం సాయితత్వం. ఇప్పటి వరకూ తెలుగుతో కలిపి 16 భాషల్లో బాబా సినిమాలొచ్చాయి. వాటన్నింటికంటే భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘1991 వరకూ మా ఇంట్లో దేవుని పటం లేదు. మోహన్‌బాబు బలవంతం మీద ఓసారి షిరిడీ వెళ్లి అక్కడ సచ్ఛరిత్ర కొని చదివాను. అప్పుడర్థమైంది బాబా తత్వం. కోట్లాదిమందికి ఆధ్యాత్మిక ఆకలి తీర్చిన మహనీయుడు సాయి. నేను ఎంఏ తెలుగు చదివాను. నా చదువుకు సార్థకత కలిగించే సినిమాకు ఇన్నాళ్లకు రాస్తున్నాను. ఇందులో నాగార్జున నోటివెంట వచ్చే పలుకులు ప్రపంచానికి శాంతిని, శక్తిని ప్రసాదించాలి’’ అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది వ్యాపారం కాదు... ప్రచారం. సచ్ఛరిత్రను దగ్గరుండి రాయించుకున్న బాబా, ఈ సినిమాను కూడా జనరంజకంగా తీయించుకుంటాడని నా నమ్మకం’’ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కె.రాఘవేంద్రరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్.గోపాల్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.