Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘సింహా’ విజయ విహారం
      రికార్డులన్నింటినీ తిరగరాస్తుందనీ.. కొత్త రికార్డులను సృష్టిస్తోందని 'సింహా' గురించి అందరూ చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన ఆ లక్ష్మీనరసింహ స్వామికి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా. కొత్తగా ఆలోచించి.. మంచి కాంబినేషన్‌తో చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కిరీటికి నా ఆశీస్సులు. కథ నుంచి కథానాయకుడు.. కథానాయకుడి నుంచి కథ పుట్టడం మనకు తెలుసు. కానీ నా మీసం నుంచి పుట్టుకొచ్చిన కథ 'సింహా'. ఇందులో నరసింహగా నన్ను చూసిన ప్రేక్షకులందరూ 'బాలకృష్ణ సినిమా అంటే ఇలా ఉండాల్రా' అనుకుంటున్నారని విన్నాను. నా సినిమా ఎలా ఉండాలో.. నా సినిమాలో ఏం ఉండాలో 'సింహా' తెలియజేసింది. ఇందులో చేసిన రెండు పాత్రలూ ఇంతకు ముందు చేయని పాత్రలే. ముఖ్యంగా నరసింహ పాత్రకు మేకప్‌ లేకుండా చేశా.

ఆ పాత్రకు అద్భుతమైన అప్లాజ్‌ వస్తోంది. నాన్నగారిని మదిలో పెట్టుకొని చేసిన పాత్ర ఇది. ఏది ఏమైనా ఇంతటి విజయానికి ప్రధాన కారకుడైన దర్శకుడు బోయపాటి శ్రీనుకు, చిత్ర యూనిట్‌సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పైరసీ భూతాన్ని తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతి అభిమానికీ ఉంది. ఏ సినిమా పైరసీ సీడీ దొరికినా క్షమించొద్దు' అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా నయనతార, స్నేహా ఉల్లాల్‌, నమిత హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సింహా'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం అఖండ విజయం సాధించిందని చిత్రం యూనిట్‌ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాలకృష్ణ పై విధంగా స్పందించారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ -"ఈ కథను బాలకృష్ణగారు 24 నిమిషాలే విన్నారు.

ఇందులో పెద్ద పెద్ద డైలాగులు ఉండవని, మీ నటన లో-ప్రొఫైల్‌లో ఉంటుందని చెప్పా. అందుకు ఆయన అభినందించి, ప్రోత్సహించారు. ఆయన ఆనాడు ఒప్పుకోకపోతే... ఈ రోజు ఈ పండుగ ఉండేదికాదు. ఈ సక్సెస్‌కి కారకులైన అందరికీ థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను' అని చెప్పారు. "హిట్‌ అవుతుందని అనుకున్నా కానీ.. ఇంత చరిత్ర సృష్టిస్తుందని అనుకోలేదు. తొలివారం ఈ సినిమా రూ. 26కోట్ల 48 లక్షల 75వేలు గ్రాస్‌ వసూలు చేసింది. ఇది ఇండస్ట్రీ రికార్డు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఈ సినిమా టిక్కెట్లు దొరక్క అభిమానులు థియేటర్‌ అద్దాలు పగలగొట్టారంటే.. ఈ సినిమా ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. పైరసీని కంట్రోల్‌ చేయడం కూడా ఈ విజయానికి కారణం. ఈ విషయంలో సహకరిస్తున్న పోలీస్‌లకు థ్యాంక్స్‌. వారి రక్షణ నిధికి 5 లక్షల రూపాయలు డొనేట్‌ చేస్తున్నా' అని నిర్మాత పరుచూరి ప్రసాద్‌ చెప్పారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com