ఫిలిం న్యూస్
 
 
 
 
శివాజీ -సదా ల హార్రర్
శివాజీ, సదా తొలిసారి జంటగా నటిస్తోన్న సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ భవంతిలో ప్రారంభమైంది. శ్రీసాయి వెంకటకృష్ణా మూవీస్ పతాకంపై భువనేశ్వరి, టి. గనిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్.రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా గురించి శివాజీ మాట్లాడుతూ "ఇది హారర్ మూవీ. ఇందులో నేను సినీ డైరెక్టర్ రోల్ చేస్తున్నా. కథ బాగుంది'' అని చెప్పారు. హీరో సదా మాట్లాడుతూ "నా పాత్ర అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. నిజంగానే ఇలాంటి పాత్రను నేను ఇంతవరకు చేయలేదు. చాలెంజింగ్ రోల్. పర్ఫార్మెన్స్ ప్రధానంగా ఉంటుంది. శివాజీతో ఇదివరకే చెయ్యాల్సింది. ఇప్పటికి కుదిరింది'' అన్నారు.

దర్శకుడు ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ "ఇది థ్రిల్లర్. భయమనే అంశాన్ని తీసుకొని చేస్తున్న సినిమా. హైదరాబాద్‌లో 30 రోజులు నిరవధికంగా జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది'' అని తెలిపారు. నిర్మాత గనిరెడ్డి మాట్లాడుతూ "ఇదివరకు మూడు సినిమాలు నిర్మించా. కథ బాగా నచ్చి ఈ సినిమా చేస్తున్నా. హీరో పాత్రకి శివాజీ సరిగ్గా సరిపోతారు'' అన్నారు. ఇందులో శివాజీ మేనేజర్ పాత్రని చేస్తున్నానని కృష్ణభగవాన్ తెలుపగా, తనో మంచి వేషం వేస్తున్నానని చిన్నా చెప్పారు.

ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, పృథ్వీ, ఫిష్ వెంకట్, కొండవలస, చిత్రం శ్రీను, విజయసాయి, చంటి, బేబి సంచలన, జయవాణి తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: మంత్ర ఆనంద్, ఛాయాగ్రహణం: వి.ఎన్. సురేశ్‌కుమార్, కూర్పు: ఉపేంద్ర, కళ: రామ్ కె.ఆర్. గోపి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రెడ్డి.