ఫిలిం న్యూస్
 
 
 
 
సుధీర్‌బాబు హీరోగా 'ఎస్.ఎం.ఎస్.'
హీరో కృష్ణ అల్లుడు సుధీర్‌బాబుని కధానాయకునిగా పరిచయం చేస్తూ హనీబి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించే 'ఎస్.ఎం.ఎస్.' చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి ఈ చిత్రానికి సమర్పకుడు. సుధీర్‌బాబు, నూతన నాయిక రెజీనాపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కృష్ణ క్లాప్‌నివ్వగా, డా.రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఏర్పాటయిన పాత్రికేయుల సమావేశంలో ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ- 'మా సంస్థ నుంచి ఎంతోమంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేశాం. ఇప్పుడు కృష్ణగారి అల్లుడు సుధీర్‌బాబుని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళంలో మా అబ్బాయి జీవా నటించిన 'ఎస్.ఎం.ఎస్.' చిత్రం ఆధారంగా ఈ సినిమా తయారవుతుంది. మా సంస్థ పరిచయం చేసిన దర్శకుడు సత్య మరో సారి తన ప్రతిభను ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ- 'మా మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న చౌదరిగారికి కృతజ్ఞతలు. నేను కృష్ణగారి అల్లుడిని. సినీరంగంలోకి ప్రవేశించాలనే కోరిక చాలాకాలంగా ఉంది. రెండేళ్ల నుంచి దీనికోసం ప్రిపేర్ అవుతున్నాను' అన్నారు.

దర్శకుడు సత్య మాట్లాడుతూ 'తెలుగులోకి నాకు ఇది రెండో సినిమా. 'భీమిలి కబడ్డీ జట్టు' నాకు మంచి పేరు తెచ్చింది. తమిళంలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఎస్.ఎం.ఎస్. అంటే 'శివ మనసులో శృతి' అని. ఈ నెల 9నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది' అన్నారు.

హీరోయిన్ రెజీనా, సంగీత దర్శకుడు సెల్వగణేష్ ఈ చిత్రానికి పనిచేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

నరేష్, రోహిణి, వినయ్ మోహన్, హర్షవర్థన్, రమేష్, కౌటిల్య, హేమంత్, ప్రియాంక తదితరులు నటించే ఈ చిత్రానికి కథ: రమేష్, తాతినేని సత్య, మాటలు: నంద్యాల రవి, ఫొటోగ్రఫీ: చిట్టిబాబు, సంగీతం: సెల్వ గణేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవీంద్ర రాణా, నిర్మాత: ఘట్టమనేని ప్రియ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తాతినేని సత్య.