"ప్రేమలోని మాధుర్యాన్ని... స్నేహంలోని ఆనందాన్ని అనుభవించని వారు ఈ జగత్తులో వుండరంటే అతిశయోక్తి కాదు. ఈ రెండిటి గొప్పతనాన్ని
తెలుపుతూ మేం నిర్మించిన చిత్రమే 'స్నేహగీతం' అంటున్నారు చిత్రం యూనిట్ సభ్యులు. సందీప్, వెంకీ, సుహాని, శ్రేయ ధన్వంతరి, రియా
ముఖ్యతారలుగా లార్‌స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'మధుర' శ్రీధర్ ఈ చిత్రం ద్వారా
దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ " నేటి యువతరానికి ప్రతీకలైన కొందరు
కుర్రకారు జీవితాలతో ప్రేమ, స్నేహం ఆడిన సయ్యాటే ఈ చిత్రం. కాలేజీ నేపథ్యంతో కూడిన ది బెస్ట్ చిత్రాల్లో ఈ చిత్రం కూడా చేరుతుంది. ప్యూరిటి,
క్లారిటి, ష్యూరిటి కలగలిస్తే 'స్నేహగీతం'. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. విడుదల విషయంలో కొంత జాప్యం జరిగినా
సరైన సమయానికే చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.తొలుత 35 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం.
తర్వాత ప్రింట్లను పెంచే అవకాశం వుంది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ " నేటి యువతరం తప్పక చూడదగ్గ చిత్రమిది. ముఖ్యంగా కాలేజీల్లో
చదివే విద్యార్థులు తప్పకుండా సినిమా చూస్తారనే నమ్మకం వుంది. కళాశాలలో చదివే యువత, వారి తల్లిదండ్రుల ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ
సినిమా వుంటుంది. నిర్మాత శ్రీధర్ గారు నా దృష్టిలో సైంటిస్ట్ లాంటి వారు. ఎందుకంటే కొత్త ప్రయోగాలను ఇష్టపడే అభిరుచి గల నిర్మాత ఆయన.
తప్పకుండా ఈ చిత్రం మా అందరి నమ్మకాన్ని నిలబెడుతుంది' అని తెలిపారు.ఈ సమావేశంలో సందీప్, వెంకీ, శ్రేయ ధన్వంతరి కూడా పాల్గొన్నారు.