ఫిలిం న్యూస్
 
 
 
 
'సోలో'గా రోహిత్
నారా రోహిత్‌ ‘సోలో’ మొదలైంది. ‘సోలిడ్‌ లవ్‌స్టోరీ’ ఉపశీర్షిక. ఎస్‌.వి.కె సినిమా పతాకంపై విశాఖవాసి వంశీకృష్ణశ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పరశురామ్‌ దర్శకుడు. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశాధినేత, నారా రోహిత్‌కు స్వయానా పెదనాన్న నారా చంద్రబాబునాయుడు, సీనియర్‌ నటుడు సుమన్‌, రోహిత్‌, పరశురామ్‌, శ్రీనివాస్‌, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు.దేవుని చిత్రపటాలపై తొలిసన్నివేశానికి చంద్రబాబు నాయుడు క్లాప్‌నివ్వగా, దర్శకుడు వంశీపైడిపల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పరశురామ్‌కు సోదరుడు వరసయ్యే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ గౌరవదర్శకత్వం వహించారు.

అనంతరం పాత్రికేయుల సమావేశంలో నిర్మాత శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘నిర్మాతగా ఇది తొలి సినిమా.మంచి యువకథానాయకుడు లభించడం అదృష్టం. మా సినిమాతో రోహిత్‌ మంచి కమర్షియల్‌ హీరో అనిపించుకుంటాడు. తొలిషెడ్యూల్‌ మార్చి 1నుంచి 25రోజులపాటు విశాఖపట్నంలో జరుగుతుంది.రెండో షెడ్యూల్‌ 10రోజుల గ్యాప్‌ తర్వాత హైదరాబాద్‌లో జరుగుతుంది. జూన్‌ తొలివారంలో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మంచి ప్రేమకథా చిత్రమిది. రోహిత్‌ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తాడు. నా కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచే సినిమా ఇది’ అన్నారు. హీరో రోహిత్‌ మాట్లాడుతూ ‘బాణం’కి ఈ చిత్రానికి పోలికే లేదు. పక్కా కమర్షియల్‌ సినిమా.

పెదనాన్న ఆశీస్సులతో ప్రారంభం కావడం ఆనందాన్నిస్తోంది. అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’ అన్నారు. సుమన్‌ మాట్లాడుతూ ‘నిర్మాత విశాఖపట్నంలో మంచి సామాజిక సేవకుడు. చాలాకాలంగా మిత్రుడు. మంచి కమిట్‌మెంట్‌తో నిర్మాతగా వస్తున్నారు. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు రోహిత్‌లో ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలి’ అన్నారు. ప్రకాష్‌రాజ్‌, షాయాజి షిండే, సుహాసిని, అలీ, రవిప్రకాష్‌, ఎం.ఎస్‌.నారాయణ, శ్రీనివాసరెడ్డి, సుభాష్‌, విష్ణు, జోగినాయుడు, జూ.రేలంగి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:దాశరథి శివేంద్ర, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: రఘు కులకర్ణి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, పాటలు: రా.జో.శాస్ర్తి, కృష్ణ చైతన్య, కథ-కథనం-దర్శకత్వం: పరశురామ్‌.