'సిద్దూ ఫ్రమ్ శీకాకుళం' నిర్మించిన వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ ఇప్పుడు ఈశ్వర్ దర్శకత్వంలో 'సీతారాముల కళ్యాణం' (లంకలో) అనే చిత్రం నితిన్, హన్సిక జంటగా నిర్మించారు. ఈ చిత్రం పాటలు ఇటీవల విశాఖపట్నంలో విడుదలయ్యాయి. ఈ పాటలు విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో జరిపారు. ఇందులో నిర్మాత మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ - కథ, ట్రీట్‌మెంట్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టి, పెద్ద చిత్రాలకు దీటుగా, రాజీలేని విధంగా ఈ చిత్రం నిర్మించాము. ఈ చిత్రంలోని ఓ పాట యూరప్‌లో 50 లక్షల ఖర్చుతో చిత్రీకరించాము. ఇందులో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా నవ్విస్తుంది. ఈ చిత్ర నిర్మాణంలో కె.ఎస్.రామారావు అమూల్యమైన సూచనలు, సలహాలతో మార్గ దర్శకత్వం వహించారు - అని చెప్పారు.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ - ఈ చిత్రం కోసం ఏడాది పాటు కథా చర్చలు జరిపి, మంచి సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో నిర్మించారు. నిర్మాత నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు ఈ సంస్థలో వస్తాయి - అని అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ మాట్లాడుతూ పాటలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి టీమ్‌తో ఈ చిత్రం చేయడం ఆనందంగా ఉంది - అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ - అనూప్ పాటలు ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి. సుబ్బరాజుకు కొత్త ఇమేజ్ తెచ్చేలా ఈ చిత్రంలోని పాత్ర ఉంటుంది. ఇందులో ఆంజనేయస్వామి తరహాలో బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. మంచి ట్రీట్‌మెంట్ ఈ చిత్రాన్ని ఈశ్వర్ బాగా చేశారు - అని అన్నారు. హన్సిక మాట్లాడుతూ - మంచి స్క్రిప్టుతో దర్శకుడు బాగా చేశారు. అనూప్ మంచి సంగీతం అందించారు. నిర్మాత ఎ్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు - అని అన్నారు. సుబ్బరాజు మాట్లాడుతూ - హీరో, విలన్ కలిసి ఆడుకునే పాత్ర నాదు. ఈశ్వర్ బాగా చేయించుకున్నారు - అని అన్నారు. ఈ కార్యక్రమంలో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.