వింత వింత దొంగతనాలతో.. ఎంత వారినైనా చిత్తు చేయడం రంగ స్పెషాలిటీ. అలాంటి ఈ దొంగగారి
జీవితంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అదేంటో తెరపై చూస్తేనే మజా' అంటున్నారు
దర్శకుడు సుధాకర్ నాయుడు(జీవి). శ్రీకాంత్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న
చిత్రం 'రంగ ది దొంగ'.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ జీవి పై విధంగా స్పందించారు. సీఆర్ మనోహర్, సుధాకర్ నాయుడు
కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విమలారామన్ ఇందులో కథానాయిక. నిర్మాత సీఆర్ మనోహర్
మాట్లాడుతూ - "ఇందులో శ్రీకాంత్ పోషిస్తున్న దొంగ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇక విమలారామన్
పాత్ర అయితే... చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కొత్త ఒరవడిలో సాగే ఫక్తు మాస్ ఎంటర్‌టైనర్ ఇది.
'మహాత్మ' తర్వాత శ్రీకాంత్‌తో నేను చేస్తున్న చిత్రమిది. పాటలు, పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన
ఆకర్షణ. ఇటీవలే శ్రీకాంత్, విమలారామన్‌పై నిక్సన్ నృత్య దర్శకత్వంలో రామానాయుడు సినీ విలేజ్‌లో
వేసిన భారీ సెట్‌లో ఓ పాట చిత్రీకరించాం. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను
చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 25 వరకు ఈ షెడ్యూలు జరుగుతుంది. మూడో షెడ్యూలు మే నెలలో ఉంటుంది'
అని తెలిపారు.
రమ్యకృష్ణ, భువనేశ్వరి, తస్లీమా, జయప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ శకుంతల, శివాజీరాజా, డా.మోహన్,
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: పూర్ణకాండ్రు, ఎడిటింగ్: గౌతంరాజు, ప్రొడక్షన్స్
ఎగ్జిక్యూటివ్: బందరు బాబి, ఆర్ట్: ఎం.బంగార్రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎం.ఎ.అజీమ్, నిర్మాణం: గోల్డెన్
లయన్ ఫిలింస్, గాడ్‌ఫాదర్ ఫిలింస్.