ఫిలిం న్యూస్
 
 
 
 
'శ్రీ రామరాజ్యం' షూటింగ్ సంపూర్ణం
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో 'హాట్‌ టాపిక్‌'గా నిలిచిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. ఎంతో మమకారంతో, పట్టుదలతో రాజీపడకుండా యలమంచిలి సాయిబాబు ఉత్తమాభిరుచి గల బాపు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. గత ఏడాది శ్రీకారం చుట్టిన ఈ పౌరాణిక చిత్రంలో బాలయ్య రాముడిగా నటించగా, సీతగా నయనతార నటించింది. వాల్మీకిగా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణుడిగా శ్రీకాంత్‌, భరతుడిగా సాయికుమార్‌... ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. 'శ్రీరామరాజ్యం'ని ఓ మహా యజ్ఞంలా భావించి నిర్మించారు సాయిబాబు. భారీ తారాగణం, భారీ సెట్లు.. ఇలా అన్ని అంశాలలోనూ భారీతనం సంతరించుకున్న ఈ చిత్రాన్ని తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది. ఇన్నాళ్లూ ఈ చిత్రాన్ని తమ చిత్రంలా భావించి కృషి చేసినందున ఈ యూనిట్‌ సభ్యులకు షూటింగ్‌ చివరి రోజున ధన్యవాదాలు తెలిపారు నిర్మాత సాయిబాబు.

ఈ చిత్రం షూటింగ్‌ చివరి రోజున చివరి సన్నివేశం చిత్రీకరణ పూర్తవ్వగానే చిత్రంలోని మొదటి పాటను లొకేషన్‌లో ప్లే చేశారు. అనంతరం యూనిట్‌ సభ్యులు బాలయ్యకు సుగంధాలు వెదజల్లే పుష్పాలతో అభిషేకంలా చేశారు. ఇలా జరగడం బాలయ్యకు తొలి అనుభవం కావడంతో ఆశ్చర్యానందాలకు గురయ్యారు. అందరూ కనబర్చిన ఆ ప్రేమకు అప్రయత్నంగా ఆయన కళ్లు చెమర్చాయి.

ఇప్పటివరకు దాదాపు గ్లామర్‌ పాత్రలకు పరిమితమైన నయనతార మొదటిసారి పూర్తి స్థాయి నటనకు అవకాశం ఉన్న పాత్రను ఈ చిత్రంలో చేసింది. 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్రలో ఒదిగిపోవడానికి నయనతార తన వంతు కృషి చేసింది. ఎంతో క్రమశిక్షణగా ఆమె ఈ పాత్రను పోషించింది. ఈ చిత్రం నయనతారకు కూడా సరికొత్త అనుభూతిని మిగిల్చింది. యూనిట్‌ సభ్యులు కనబర్చిన ప్రేమాభిమానాలకు నయనతార కళ్లు చెమర్చాయి.

ఇక ఈ చిత్రంలో వాల్మీకిగా నటించిన డా|| అక్కినేని నాగేశ్వరరావు పలు సందర్భాల్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాములుగా కథ, తన పాత్ర నచ్చితేనే అక్కినేని నటించడానికి అంగీకరిస్తారు. ఈ చిత్రం గురించి సాయిబాబు, బాపు చెప్పగానే ఆయన గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో లొకేషన్‌లోనే కాకుండా ఇంట్లో కూడా 'శ్రీరామరాజ్యం' గురించి అక్కినేని చర్చించేవారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. దాన్నిబట్టి అక్కినేని ఈ చిత్రాన్ని ఎంత ఇష్టపడి చేశారో అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రానికి సంబంధించిన ఆకర్షణల్లో మరో ప్రత్యేకమైన ఆకర్షణ మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా సంగీతం. ఈ భారీ పౌరాణిక చిత్రానికి ఇళయరాజా అందించిన మ్యూజిక్‌ ఓ ఎస్సెట్‌గా నిలుస్తుంది. ఈ పాటలను బాపు కనువిందుగా చిత్రీకరించారు. 'శ్రీరామరాజ్యం' పాటలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇళయరాజా పాటలు ఇచ్చారు. ఇందులో మొత్తం 8పాటలు, కొన్ని బిట్‌ సాంగ్స్‌ ఉంటాయి. ఆగస్ట్‌లో ఈ పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఆకర్షణల్లో 'సెట్స్‌'కి కూడా ప్రధాన పాత్ర ఉంది. కళాదర్శకులు రవీందర్‌, కిరణ్‌ ఆధ్వర్యంలో భారీ సెట్స్‌ రూపకల్పన జరిగింది. బహుశా ఈ మధ్యకాలంలో ఏ చిత్రానికీ ఇన్ని భారీ సెట్లు వేయలేదని చెప్పొచ్చు. కథానుసారం ఏమాత్రం రాజీపడకుండా సాయిబాబు ఈ సెట్లను వేయించారు. నాటి చరిత్రను అద్దంపట్టే విధంగా ఉంటాయి ఈ సెట్స్‌. కేవలం ఈ సెట్స్‌కే కోట్ల రూపాయల్లో ఖర్చయ్యిందని సమాచారం. మహానటుడు ఎన్టీఆర్‌ నటించిన 'లవకుశ' చిత్రం స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకెళ్లాలన్నది సాయిబాబు ఆశయం. అందుకే ఈ చిత్రాన్ని కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. . తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ ఆణిముత్యంగా నిలిచిపోయే ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.