ఫిలిం న్యూస్
 
 
 
 
సుమన్ తో మహిళా చిత్రం

శ్రీ వెంకటనరసింహా క్రియేషన్స్ పతాకంపై సుమన్, నదియా జంటగా అంతా మహిళా సాంకేతిక నిపుణులతో పి. హైమారెడ్డి దర్శకత్వంలో మణిమహేష్ నిర్మిస్తున్న చిత్రం ఆదివారం ఆరంభమైంది. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే కాంతారావు కెమెరా స్విచాన్ చేయగా నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. ఈ సన్నివేశానికి డాక్టర్ డి. రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.

సుమన్ మాట్లాడుతూ - ‘‘మధ్యవయసులో ఉన్న ఇద్దరు కొన్నాళ్ల ఎడబాటు తర్వాత కలిసి, వారి గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి లోనవుతారనేది ఈ చిత్రం ప్రధానాంశం. వృద్ధులకు మెసేజ్‌తో పాటు వారి మనసుని మసాజ్ చేసే చిత్రం’’ అన్నారు. దర్శకురాలు హైమారెడ్డి మాట్లాడుతూ - ‘‘మహిళా టెక్నీషియన్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రకథ మాత్రం మహిళలకు సంబంధించినది కాదు. పరిణతి చెందిన ప్రేమ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు.

‘‘ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం వృద్ధ కళాకారుల కోసం కేటాయిస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కౌసల్య, ఫొటోగ్రఫి: విజయలక్ష్మి, పాటలు: కౌసల్య, శ్రేష్ట, డాన్స్: పూజా జోషి, మోరిచ ఫెర్నాండెజ్, ఆడియోగ్రఫి: ఎమ్. గీతాగురప్ప, ఎడిటింగ్: ముత్తులక్ష్మి, కాస్ట్యూమ్ డిజైనర్: జయంతి, మేకప్: శోభ, ఆర్ట్: లీలాచంద్ర.