ఫిలిం న్యూస్
 
 
 
 
తనీష్ 'సలామత్'

తనీశ్ కథానాయకునిగా వెరా ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న 'సలామత్' షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. 'ఆల్ ఈజ్ వెల్' అనేది ఉప శీర్షిక. రమ్య నంబీశన్, ఆషిక నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అవినాశ్ ఓ. శ్రీధర్ దర్శకుడు. తొలి సన్నివేశానికి నిర్మాత డి. సురేశ్‌బాబు క్లాప్‌నివ్వగా, మరో నిర్మాత లగడపాటి శ్రీధర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి సీనియర్ డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామనీ, మలేషియా, బ్యాంకాక్, గోవా, హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామనీ చెప్పారు. దర్శకుడు అవినాశ్ మాట్లాడుతూ "యువతని లక్ష్యంగా చేసుకున్న కథ ఇది. మలేషియాలో జీవించే తెలుగువాళ్ల నేపథ్యంలో నడిచే ప్రేమకథ. తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నాం'' అని తెలిపారు.

హీరో తనీశ్ మాట్లాడుతూ "ముగ్గురి మధ్య నడిచే అందమైన ప్రేమకథ ఇది. స్క్రీన్‌ప్లే వైవిధ్యంగా ఉంటుంది. మానవ భావోద్వేగాలకి ప్రాధాన్యముంటుంది'' అన్నారు. చిత్రంలోని ఆరు పాటల్నీ తానే రాస్తున్నానని గేయ రచయిత జె.ఎస్. నివాస్ తెలిపారు. ఈ సమావేశంలో నాయిక ఆషిక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లోహిత్, కొరియోగ్రాఫర్ కేశవ్ మాట్లాడారు.

నాగబాబు, లోహిత్, వేణు, సోనా నాయర్, యామిని, శ్వేతా మీనన్ తారాగణమైన ఈ చిత్రానికి కథ, మాటలు: స్వర్ణతులసి, సంగీతం: మెజ్జో జోసెఫ్, ఛాయాగ్రహణం: ప్రతాప్ వి. కుమార్, కూర్పు: ఓ. రవిశంకర్, కళ: నాగేంద్రప్రసాద్, స్టంట్స్: నందు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అవినాశ్ ఓ. శ్రీధర్.