హైదరాబాద్ నగరం బిర్యానీకి ఎంత ప్రసిద్ధి చెందిందో అలాగే ఇరానీ ఛాయ్ కూడా అంత ఫేమస్. సగటు మనిషికి కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పబడే ఇరానీ హోటల్ చుట్టూ అల్లబడిన ఓ విచిత్రమైన కథతో 'టీ.. సమోసా.. బిస్కెట్' చిత్రం తయారవుతోంది. శ్రీహరి హీరోగా నటించే ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ నిర్మించనున్నారు. ఇంతకుముందు ఆయన 'నల్లపూసలు', 'ఎన్.టి.ఆర్.నగర్' తదితర చిత్రాలు రూపొందించారు.
ఈ చిత్రం వివరాలు వెల్లడించేందుకు తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో శ్రీహరి మాట్లాడుతూ- 'దర్శకుడు బాబ్జీ గత పదేళ్లుగా చిత్రపరిశ్రమలో ఉంటూ అంకితభావంతో పనిచేస్తున్నారు. ఆయన వివరించిన ఈ చిత్రం కాన్సెప్ట్ నాకెంతో నచ్చింది. ఈ రోజుల్లో నగరాలు అధునాతన కాఫీ, పబ్బులమయమయ్యాయి. పేదవాడు పదినిముషాలు సేద తీరుతామన్నా ఎలాంటి హోటల్స్ లేవు. ఈ పాయింట్‌ను ప్రధానాంశంగా ఎన్నుకుని ఈ చిత్రం తయారు చేస్తున్నాం' అన్నారు.
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ- 'శ్రీహరితో సినిమా చేయాలన్న నా చిరకాల కోరిక ఈ సినిమాతో నెరవేరుతోంది. ఈ సినిమా కోసం 50 లక్షల రూపాయల వ్యయంతో ఓ సెట్‌ను నిర్మించనున్నాం. జూన్‌లో షూటింగ్ మొదలు పెట్టి, రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు.
ఈ సమావేశంలో ఛాయాగ్రాహకుడు వి.శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. సిరా ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్నారు.