ఫిలిం న్యూస్
 
 
 
 
మళ్ళీ తేజ 'స్టార్ హంట్ '

‘చిత్రం’తో ఉదయ్‌కిరణ్, ‘జయం’తో నితిన్, ‘జై’తో నవదీప్, ‘లక్ష్మీకళ్యాణం’తో కాజల్ అగర్వాల్... ఇలా ఎందరో తారల్ని పరిచయం చేసిన తేజ మళ్లీ కొత్తవాళ్లతో ఓ సినిమా చేయబోతున్నారు. ‘శౌర్యం’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం రేడియో మిర్చి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘స్టార్ హంట్’ నిర్వహిస్తున్నారు.

ఈ విశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తేజ మాట్లాడుతూ - ‘‘ఈ మధ్య నటులు తగ్గిపోయి, స్టార్లు పెరిగారు. నాకు స్టార్లు అవసరం లేదు. అందుకే కొత్తవాళ్లతో తీస్తాను. మూడేళ్ల విరామం తర్వాత ఈ చిత్రం చేయబోతున్నా. 30మంది నూతన నటీనటులకు ఈ చిత్రంలో అవకాశం కల్పించబోతున్నాం. 16 నుంచి 20ఏళ్లలోపు వయసున్నవారిని హీరో, హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకుంటున్నాం.

ఇప్పటికి 297మంది కొత్తవారికి అవకాశం ఇచ్చాను. ఆగస్ట్ 15నాటికి నటీనటుల ఎంపిక పూర్తి చేసి సెప్టెంబర్ 1న ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభిస్తాం. ఇది ప్రేమకథా చిత్రం’’ అన్నారు. ‘‘హీరో, హీరోయిన్, విలన్, పాటల రచయిత తదితరులకు అవకాశం కల్పించనున్నాం’’ అని ఆనంద్ ప్రసాద్ అన్నారు. ఈ సమావేశంలో భవ్య సిమెం ట్స్ ప్రతినిధి జగన్, రేడియో మిర్చి ప్రతినిధి శేఖర్ వేటూరి కూడా పాల్గొన్నారు.