ఫిలిం న్యూస్
 
 
 
 
28న ‘వారెవా’
‘‘ఇటీవలే ‘వారెవా’ చూశాను. అన్ని రకాలుగా సినిమా బాగుంది. యాక్షన్, హ్యూమర్, సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో మేళవించి దర్శకుడు మహి సినిమాను మలిచాడు. సినిమా బాగా వచ్చిందని సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్ కూడా చెప్పారు. చాలా ఆనందం కలిగింది. ఇదిలావుంటే... ఇటీవలే హఠాన్మరణం పాలైన ఫొటో జర్నలిస్ట్ సతీష్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

ఆయన కుటుంబానికి 25 వేల రూపాయలు అందజేస్తా’’ అని డా.బ్రహ్మానందం తెలిపారు. ఆయన తనయుడు గౌతమ్ హీరోగా మహి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మానందం పై విధంగా స్పందించారు. దర్శకుడు మహి మాట్లాడుతూ-‘‘సినిమా పూర్తయింది. సోమవారం సెన్సార్ పూర్తి చేసుకోనుంది. మహేష్ శంకర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించనున్నాం’’ అని చెప్పారు.

‘‘పాటలు విన్నవారు ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. సంగీత దర్శకుడు మహేష్ శంకర్‌కి థ్యాంక్స్. ఆడియో హిట్ చేసినట్టే సినిమా కూడా హిట్ చేస్తారని ఆశతో ఉన్నా’’ అని హీరో గౌతమ్ ఆశాభావం వ్యకపరిచారు. ఇంకా సహ నిర్మాతలు సీహెచ్ వెంకటరెడ్డి, జానకిరామ్(జాని) కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శాంభవి కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, దేవన్, సాయాజీ షిండే, జీవా, మాస్టర్ భరత్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ప్రగతి, సురేఖావాణి తదితరులు ఇతర పాత్రధారులు.ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి తులసి.