అల్లు అర్జున్... సమ్మర్‌లో 'వరుడు'గా రానున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో డీవీవి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ పరంపరతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ... ప్రతిష్టాత్మక చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తొలి కలయికలో ఈ చిత్రం రూపొందడం, అల్లు అర్జున్‌తో 'దేశముదురు' లాంటి చిత్రాన్ని నిర్మించిన డి.వి.వి.దానయ్య ఈ చిత్రానికి నిర్మాత కావడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.
నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి గుణశేఖర్ మాట్లాడుతూ- "ఇంతవరకు చేయని పూర్తి వైవిధ్యమైన పాత్రలో అల్లు అర్జున్ చేస్తున్నారు. తమిళ హీరో ఆర్య ఇందులో విలన్‌గా చేస్తున్నారు. వీరిద్దరూ పాల్గొన్న క్లైమాక్స్ ఫైట్‌ను 15 రోజుల పాటు స్టంట్ మాస్టర్ శివ నేతృత్వంలో చిత్రీకరించాం. ఈ చిత్రంలో వందకు పైగా నిజమైన కుటుంబాలు నటించడం విశేషం. కొత్త అమ్మాయిని ఇందులో కథానాయికగా పరిచయం చేయనున్నాం.
సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్‌టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ 'వరుడు'లో సమపాళ్లలో ఉంటాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 26న సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేస్తాం' అని తెలిపారు. తమ సంస్థలో చాలా కాస్ట్‌లీ సినిమా ఇదని, 'దేశముదురు'ను మించే స్థాయిలో ఈసినిమా ఉంటుందని దానయ్య చెప్పారు. సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, డా.బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.