వనకన్యగా ఆర్తీ అగర్వాల్, వండర్ వీరునిగా మెగా సుప్రీమ్ నటిస్తున్న 'వనకన్య వండర్ వీరుడు' చిత్రం షూటింగ్ ఓ పాట మినహా పూర్తయింది. శివనాగు దర్శకత్వంలో శ్రీ రాఘవేంద్ర ఫిలిమ్స్ పతాకంపై జాలాది శివశంకర్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానుగుణంగా వచ్చే గ్రాఫిక్స్ ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తాయని శివనాగు తెలిపారు.
ఫిల్మ్‌చాంబర్ ప్రివ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఇది మాస్ ఎంటర్‌టైనర్. మెగా సుప్రీమ్ నటన, ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ఆర్తీ అగర్వాల్ వనలోకం నుంచి భూలోకానికి వచ్చే సందర్భంగా జరిగే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. 50 శాతం కామెడీ ఉంటుంది'' అని చెప్పారు. పెద్ద హీరో సినిమాకి పెట్టినట్లు బాగా ఖర్చుపెట్టి ఈ సినిమా తీస్తున్నారని నటుడు నర్సింగ్ యాదవ్ తెలిపారు.
నిర్మాత శివశంకర్ చౌదరి మాట్లాడుతూ- "టైటిల్ రోల్స్‌లో ఆర్తీ అగర్వాల్, మెగా సుప్రీమ్ బాగా చేశారు. మంచి మ్యూజిక్ కుదిరింది. ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
గిరిబాబు, జీవా, రఘుబాబు, పృథ్వీ, సుమన్‌శెట్టి, గుండు హనుమంతరావు, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, ప్రసన్నకుమార్, జయవాణి తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: జి.వి. అమరేశ్వరరావు, సంగీతం: రాజ్‌కిరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగు.