గోపీచంద్-దీక్షాసేత్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘వాంటెడ్’. భవ్య క్రియేషన్స్
పతాకంపై వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి.వి.ఎస్ రవి దర్శకుడిగా
పరిచయమవుతున్నారు. చక్రి సంగీత దర్శకుడు.
జనవరి 26 విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘హీరో గోపీచంద్ కెరీర్‌లోనే
ప్రత్యేకమైన సినిమా ఇది. నటనపరంగా హైలైట్. ఆయన అభిమానులకు పండుగ చేస్తుంది.
అదేగాక ఇటీవల విడుదలైన ఆడియోకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మెయిల్స్,
ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌ల ద్వారా అంతా తమ స్పందనను తెలియజేస్తున్నారు.
నిర్మాణపరంగా కూడా బాగా వచ్చింది. సీన్ తర్వాత సీన్‌లా కాకుండా ప్రతి సన్నివేశం హైలైట్‌గా
చిత్రీకరించాం.కుటుంబ ప్రేక్షకులు సహా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకముంది.
ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ ఈమధ్య కాలంలో చేయని సరికొత్త నటనాభినయాన్ని ఈ సినిమాలో
ప్రదర్శించారు. మాటతీరు సహా వేషధారణలోనూ కొత్తగా కనిపిస్తారు. వరుసగా మంచి పాత్రలతో
దూసుకెళుతున్న కథానాయిక దీక్షాసేథ్ ఈ సినిమాలో క్లిష్టమైన పాత్రను సమర్థంగా చేశారు.
ప్రస్తుతం డిజిటల్ కార్యక్రమాలు నడుస్తున్నాయి’ అన్నారు.
నిర్మాతమాట్లాడుతూ ‘శౌర్యం-తర్వాత ఆ స్థాయిని మించిన సినిమా
చేయాలనుకున్నాం.అందుకు తగ్గట్టే సినిమా వచ్చింది. గోపీచంద్ అన్నిరకాలా సహకరించారు.
సొంత సంస్థలా బాధ్యతలన్నీ తన భుజాలపై మోశారు. తొలుత కథ కోసం
వెతుకుతున్నప్పుడు..‘గోలీమార్’ షూటింగ్ టైంలో దర్శకుడు పూరీజగన్నాథ్ స్క్రిప్టుతో సహా
రవిని నా దగ్గరికి పంపించారు. కథ నచ్చింది. తర్వాత 3నెలలపాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఈనెల
26న విడుదల చేస్తున్నాం’ అన్నారు.
దీక్షాసేత్ మాట్లాడుతూ ‘నందిని నా పాత్ర పేరు. సోలో గా ఇదే తొలిసారి. పల్లె
పడతిగా..నటనపరంగా ఛాలెంజింగ్ రోల్ చేశాననిపించింది. దర్శకుడు సినిమాని, నా పాత్రని
మలిచిన తీరు ప్రత్యేకం’ అన్నారు.