మోహన్‌బాబు సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించే చిత్రం 'ఊ కొడతారా -
ఉలిక్కిపడతారా'. నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం శేఖర్ రాజా.
'బోబో' శశి సంగీతం సమకూర్చారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ- "ఇది మా సొంత బ్యానర్‌లాంటిది. లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా 'మంచు
ఎంటర్‌టైన్‌మెంట్' పతాకం స్థాపించడం ఆనందంగా ఉంది. ఆమె ఎంతో పట్టుదల ఉన్న వ్యక్తి. చలన చిత్ర నిర్మాణరంగంపై బాగా
అవగాహన ఉంది. మోహన్‌బాబు కూతురుగా కాకుండా సొంతంగా తనకంటూ ఓ ఇమేజ్ ఉండాలనుకొనే లక్ష్మీ ప్రసన్న...
తప్పకుండా నిర్మాతగా కూడా రాణిస్తుంది. ఎంతో సాహసంతో ఈ ప్రాజెక్టు చేయడానికి ఆమె సంకల్పించారు. 1982లో 'శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్' బ్యానర్‌ని స్వర్గీయ ఎన్టీ రామారావు కొబ్బరికాయకొట్టగా... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాప్‌కొట్టి ప్రారంభించారు. ఇదే బ్యానర్‌లో నిర్మించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో నాన్న నటించారు. 'శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ స్థాపించిన పదేళ్లకు నాన్న ఆ బ్యానర్‌లో నటించగా... 'మంచు ఎంటర్‌టైన్‌మెంట్' పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రంలోనే నేను నటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. వారి అభిరుచికి అనుగుణంగానే సినిమాలు నిర్మించాలి. నాకు వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. అందులో భాగంగానే ఈ
సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా. నాకు బాగా నచ్చిన సినిమా ఇది. టైటిల్‌లో కూడా చాలా కొత్తదనం ఉంది. మీరే ఈ
సినిమాను తెరపై చూస్తారు. నూతన దర్శకుడు శేఖర్ రాజా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. మూడేళ్లుగా మనోజ్
పడిన తపన కార్యరూపం దాలుస్తోంది. ఇందులో నేనూ భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమాను
సమష్టిగా తీయడానికి అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తుంది'' అన్నారు.
నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ- "గతంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నాన్న మోహన్‌బాబు ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఈ మధ్యనే తీసిన 'ఝుమ్మందినాదం' చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరించినప్పుడు... ఒక నిర్మాతగా నాన్న ఎంత కష్టపడి పనిచేశారో, ఎలా విజయాలు సొంతం చేసుకొన్నారో అర్థమైంది. ఆ తరువాత 'ప్రేమతో మీ లక్ష్మీ' ప్రొగ్రాం చేసేటప్పుడు 'మంచు ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని నాన్నకు చెప్పగానే ఆయన స్వాగతించి ఆశీర్వదించారు. 'నేను మీకు తెలుసా?' అనే వైవిధ్యమైన సినిమాలో గతంలో మనోజ్
నటించారు. ఇలాంటి కాన్సెప్ట్స్ సినిమాలు చాలా అరదుగా తెరకెక్కుతుంటాయి. తమ్ముడు మనోజ్‌కి, నాకు డిఫరెంట్
ఐడియాలు వస్తుంటాయి. మా ఇద్దరి అభిరుచికి అనుగుణంగా సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌ని స్థాపించాం. మనోజ్
డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ఊ... కొడతారా..!? ఉలిక్కి పడతారా..!?' చిత్రాన్ని ఈ బ్యానర్‌లో తొలి చిత్రంగా తెరకు
ఎక్కించబోతున్నాం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో నటించేందుకు నందమూరి బాలకృష్ణగారు నటించడానికి
అంగీకరించడం ఆనందంగా ఉంది. కథను విన్న వెంటనే ఒప్పుకున్నందుకు అన్నయ్య బాలకృష్ణకు కృతజ్ఞతలు. ఇందులో ఓ
అద్భుతమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు చేయని పాత్ర అది. తెరమీద ఆయన నటన చూసి అందరూ
ఎంతో థ్రిల్‌గా ఫీలవుతారు. మనోజ్ పాత్ర చాలా కొత్త యాంగిల్‌లో ఉంటుంది. ఈ క్యారెక్టర్‌కోసం తమ్ముడు ఎంతో హోమ్‌వర్క్
చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకునే మనోజ్‌కి ఈ చిత్రం కచ్చితంగా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు శేఖర్ రాజా
స్క్రిప్టుని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా జులై 13 నుంచి సెట్స్‌పైకి వెళుతుంది. మణికొండలో ఈ సినిమా కోసం ఓ భారీ
సెట్ వేశాం. ఎలాంటి హంగామా లేకుండా సింపుల్‌గా మా బ్యానర్‌ని, సినిమాను ప్రారంభించాం. అన్నయ్య బాలకృష్ణ లేకుండా
సినిమా ప్రారంభించకూడదని అనుకున్నాం. షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్నా వచ్చారు. ఆయన మా వెనుక ఉంటే అదే వెయ్యి
ఏనుగుల బలంతో సమానం'' అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ- "నందమూరి బాలకృష్ణగారితో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా డ్రీమ్ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది'' అన్నారు.
ఇందులో హీరోయిన్‌గా దీక్షాసేథ్ నటిస్తుంది. ప్రభు, సాయికుమార్, సునీల్, బ్రహ్మానందం, రిషి ఇతర ముఖ్య తారాగణం. ఈ సినిమాకి సంగీతం: 'బోబో' శశి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సలీమ్-సులేమాన్, ఛాయాగ్రహణం: రాజశేఖర్, మాటలు: లక్ష్మీభూపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ రాజా