ఫిలిం న్యూస్
 
 
 
 
'యమహో యమః' ప్రారంభం

యమధర్మరాజుగా తొలిసారి శ్రీహరి నటిస్తున్న 'యమహో యమః' చిత్రం షూటింగ్ మంగళవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్ హీరో హీరోయిన్లు. జి.వి.కె. ఆర్ట్స్ పతాకంపై జి. విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జితేందర్ వై. దర్శకుడు. శ్రీహరి, సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్‌తో పాటు అతిథి పాత్ర చేస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాత కె. అచ్చిరెడ్డి క్లాప్‌నివ్వగా, మరో నిర్మాత బెల్లంకొండ సురేశ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ "తొలిసారి యముడిగా బరువైన పాత్ర చేస్తున్నా. ఇది అసాధారణ స్క్రిప్టు. బాగా నవ్వించే సినిమా. జితేందర్ ఈ సబ్జెక్టుని బాగా హ్యాండిల్ చేస్తాడని నమ్ముతున్నా. అమెరికాలో షూటింగ్ జరుగుతుంది. ఇదివరకు మహామహులు పోషించిన ఈ పాత్రని బాగా చేసి, నన్ను నేను నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా'' అన్నారు. హీరో సాయిరాం మాట్లాడుతూ యమునిగా శ్రీహరి చేస్తుండటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అమెరికా వెళ్లిన ఓ కుర్రాడికీ, అక్కడకు వచ్చిన యమునిగా మధ్య జరిగే కథ ఇది'' అని చెప్పారు. చాలా గ్యాప్‌తో ఈ సినిమా చేస్తున్నాననీ, అమెరికాలో ఉండే తెలుగమ్మాయిగా నటిస్తున్నాననీ పార్వతి తెలిపారు.

నిర్మాత విజయ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ "సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో షూటింగ్ జరుపుతాం. ఓ యువహీరో ఇందులో ఓ పాటలో నటించబోతున్నారు'' అని చెప్పారు. దర్శకుడు జితేందర్ మాట్లాడుతూ "ఇంతవరకు మన ప్రాంతంలోనే అలరిస్తూ వచ్చిన యముడు అమెరికాలో అడుగుపెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అల్లిన కథ ఇది. కథకి ఆయువుపట్టయిన యముని పాత్రను చేయడానికి శ్రీహరి ఒప్పుకోవడం సంతోషంగా ఉంది'' అన్నారు.

చిత్రంలో ఆరు పాటలుంటాయని సంగీత దర్శకుడు మహతి చెప్పారు. అలీ, భరత్, కోవై సరళ ఇంతవరకు ఎంపికైన తారాగణం. వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, చిర్రావూరి, ఛాయాగ్రహణం: భరణి కె. ధరన్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జితేందర్ వై.