అన్యాయాన్ని అంతమొందించే విషయంలో విలన్ల పాలిట యముడిలాంటివాడు ఆ పోలీసాఫీసర్.
నీతికీ నిజాయితీకి మారు పేరుగా నిలిచే ఆ పోలీసాఫీసర్ తన జీవితంలో ఎలాంటి సంఘటనలు
ఎదుర్కొన్నాడు? తన బాటకి అడ్డొచ్చిన అడ్డంకులను ఎలా అధిగమించాడు? పోలీస్ పవర్‌ను ఎలా
చూపించాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'సింగమ్'.
సూర్య పోలీసాఫీసర్‌గా, ఆయన సరసన అనుష్క కథానాయికగా హరి దర్శకత్వంలో తమిళంలో
రూపొందిన ఈ చిత్రాన్ని రిలయన్స్ బిగ్ పిక్చర్స్ సమర్పణలో స్టూడియో గ్రీన్ సంస్థ ద్వారా
జ్ఞానవేల్ రాజా తెలుగులోకి విడుదల చేస్తున్నారు. తెలుగు చిత్రానికి 'యముడు' అని టైటిల్
ఖరారు చేశారు. జులై 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన
పాత్రికేయుల సమావేశంలో సూర్య, అనుష్క, జ్ఞానవేల్‌రాజా, రచయిత సాహితి, నైజం
పంపిణీదారుడు అభిషేక్ పాల్గొన్నారు.
సూర్య మాట్లాడుతూ - "తమిళంలో ఈ చిత్రం త్వరలో 'శివాజి' కలక్షన్లను చేరుకోబోతోంది.
థియేటర్స్ అసోసియేషన్ వారు ఫోన్ చేసి, 'మంచి సినిమా ఇచ్చారు. మేమంతా హ్యాపీ. వసూళ్లు
బాగున్నాయి' అన్నారు. మొదటిసారి నాకిలాంటి అనుభవం ఎదురయ్యింది. అలాగే 65ఏళ్ల బామ్మ
నుంచి 5ఏళ్ల కుర్రాడు వరకూ ఈ సినిమా చూశామని చెప్పినప్పుడు అన్ని వర్గాలవారు
చూస్తున్నారని తెలిసింది. ఇంతమంచి చిత్రం అందించినందుకు ఆనందంగా ఉంది' అన్నారు.
ఇందులో ఉన్న మొత్తం ఆరు పాటలను తానే రాశానని సాహితి అన్నారు. ఇది డబ్బింగ్ చిత్రంలా
అనిపించదని, తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా ఆ స్థాయి
విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని అనుష్క చెప్పారు. జ్ఞానవేల్‌రాజా
మాట్లాడుతూ - "స్టూడియో గ్రీన్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్న మూడో సినిమా ఇది. తమిళ
'సింగమ్' భారీ వసూళ్లు కురిపించినట్లుగానే తెలుగు 'యముడు' కూడా మంచి కలక్షన్స్
రాబడుతుందని ఆశిస్తున్నా' అన్నారు.