ది వాల్ట్ డిస్నీ కంపెనీ తెలుగులో దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఇందులో సిద్దార్ధ, శృతిహసన్, లక్ష్మీ మంచు, హర్షిత నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2009లో ప్రారంభించారు. 2011 జనవరిలో విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సిద్దార్ధ కత్తియుద్ధాల పోరాటయోధునిగా కొత్త పాత్రలో అలరించబోతున్నాడు. కమల్ హసన్ కుమార్తె శృతిహసన్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇటీవల బుల్లితెరపై మెరిసిన మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు ఒక విభిన్నమైన పాత్ర పోషించనున్నారు.
భీమిలి, విశాఖ, రామోజీ ఫిలింసిటీలో జరిగిన షెడ్యూల్స్‌లో భారీ సెట్స్‌వేసి షూటింగ్ చేశారు. ఫాంటసీ సినిమాకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌కు నిఖార్‌ధావన్, భక్తిరెడ్డి డిజైన్ చేశారు. హాలీవుడ్ స్థాయిలో ఫైర్‌ఫ్లె గ్రాఫిక్స్ ఉండడం విశేషం.
వాల్ట్ డిస్నీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సామత్ మాట్లాడుతూ- ‘ఎంతో ప్రావీణ్యంగల టీమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇండియాలో డిస్నీని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా చూడడం కోసం ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉండే ప్రాంతీయ కథలను ఎంచుకుని, పిల్లలకు, పెద్దలకు అందించడానికి ప్రయత్నిస్తాం. అమెరికా తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే డిస్నీ ఎక్కువ పెట్టుబడులు పెట్టిందని అన్నారు. మనిషి, అతని నమ్మకానికి మధ్య ఎప్పటికీ చెరిగిపోని ఒక అవినాభావ సంబంధాన్ని స్పృశిస్తూ... అంగరాజ్యంలో కన్నీటి బొట్టు ఆకారంలో ఉండే కల్పనిక గ్రామంలో కథ నడుస్తుంది. క్షుద్రశక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలనుకునే రాక్షస మహారాణి (లక్ష్మి మంచు) బారి నుంచి దైవశక్తులు గల తొమ్మిది యేళ్ళ పాప (హర్షిత)ను కాపాడడానికి ఒక మహావీరుడు (సిద్దార్థ)కి, రాక్షసరాణికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర కథాంశం. శృతిహసన్ ఆ వీరుడికి ప్రేమికురాలిగా ఒక జిప్సీ వనిత పాత్ర పోషిస్తున్నారు’ అని అన్నారు.
దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి మాట్లాడుతూ- ‘ఈ కథ కల్పనిక జగత్తులో జరుగుతుంది. క్యారెక్టర్ జీవం పోసుకున్నప్పుడు ఆలోచనల్లోంచి వింతప్రపంచం బయటకు వచ్చినప్పుడు గొప్ప అనుభూతికి లోనయ్యాను. వాల్ట్ డిస్నీతో పనిచేయడం గర్వంగా ఫీలవుతున్నాను’ అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, రవిబాబు, అలీ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సౌందర్‌రాజన్, ఫైట్స్: విలియమ్ ఒంగ్ (మలేషియా), ఆర్ట్: భూపేష్ ఆర్. భూపతి, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, నిర్మాత: దేవినేని ప్రసాద్.