శృతిహాసన్, సిద్దార్థ జంటగా 'ఎ బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్' పతాకంపై తన తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న చిత్రం రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. జాతీయస్థాయి అవార్డు తెచ్చిన 'బొమ్మలాట' తర్వాత ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఈయనే ఈ చిత్రానికి ఆంగ్లంలో సంభాషణలు రాస్తుండగా, తెలుగులో జె.కె. భారవి, రమేష్‌సామల రాస్తున్నారు. భూపేష్‌ఆర్.భూపతి వేసిన అద్భుతమైన సన్‌ఫ్లవర్ సెట్‌లో సిద్దార్థ, శృతిహాసన్, బేబి శ్రియాశర్మ 'ఆల్ ది బెస్ట్' అని చెప్పడాన్ని ముహూర్తపు షాట్‌గా చిత్రించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ కెమెరా స్విచ్‌ఆన్ చేయగా, యస్.యస్.రాజమౌళి క్లాప్‌నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
భారవి సినిమా యూనిట్ ను పరిచయం చేస్తూ... ఈ సినిమా ఫాంటసీగా రూపొందుతోంది. సిద్దార్థ ఈ సినిమాలో వీరప్రేమికుడిగా, యోధుడుగా కనిపిస్తాడు. శృతిహాసన్ ఈ సినిమాలో కొత్త హొయలు ఒలకపోస్తుంది. ఈ సినిమాకు విద్యాధికులైన యువకులు దాదాపు పన్నెండుమంది పనిచేస్తున్నారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ' సన్‌ఫ్లవర్ సెట్లో 15రోజులపాటు షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత విదేశాల్లో ఔట్‌డోర్‌లో మరో అద్భుతమైన సెట్‌వేసి చిత్రాన్ని తీస్తాం. సన్‌ఫ్లవర్‌ను టచ్‌చేస్తే వేరే లోకంలోకి వెళ్ళేట్లుగా ఉంటుంది. ఇది ఫాంటసీ కథతో కూడిన చిత్రం. గ్రాఫిక్స్‌కు పెద్దపీటవేసి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఉండేట్లుగా చిత్రముంటుంది' అని అన్నారు.రాజమౌళి మాట్లాడుతూ- 'ఏ సినిమా అయినా కొత్తగా ప్రెజెంట్ చేస్తే మంచి విజయం సాధిస్తుంది. ప్రకాష్‌లో చాలా ప్రతిభ వుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ చదివాను. చాలా బాగుంది. ఇటువంటి కథ ఇటీవల కాలంలో రాలేదు. ఇప్పటివరకు లవర్‌బారుగా ఉన్న సిద్దార్థ ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తాడు. మానవీయ సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిని తెరపై చూపించే విధానమే వైవిధ్యంగా ఉండాలి. అలా తీర్చిదిద్దడంలో ఎప్పుడూ కొత్తగా ఆలోచించే ప్రకాష్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకముంది' అన్నారు.జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ-‘ప్రకాష్ నా స్నేహితుడు. అతడు ప్రతి నిమిషం సినిమా గురించి కలలు కంటుంటాడు. ప్రతి విషయం వైవిధ్యంగా వుండాలని అనుకుంటాడు. అతను గతంలోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రకాష్ ప్రపంచాన్ని చదివాడు. అతను తీస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.
సిద్దార్థ మాట్లాడుతూ, ' రాజమౌళి వంటి వారు అవకాశం ఇవ్వక నేను లవర్‌బారు అయ్యాను. మణిరత్నం వద్ద పనిచేశాను కానీ, గొప్ప దర్శకులతో హీరోగా చేయలేదు. ఒకనాటి దర్శకులు సినిమాను అంకితభావంతో చేసేవారు. అలాంటి భావం ప్రకాష్‌లో కనబడుతుంది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దే చిత్రమిది. టెక్నికల్‌గా విందు భోజనంలాంటిది' అని చెప్పారు.
శృతి హాసన్ మాట్లాడుతూ, ' తెలుగులో మొదటిసారిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. స్క్రీప్ట్‌లో కొత్తదనం నచ్చింది. సహ నటీనటులు కూడా నేను నటించడానికి మరో కారణం' అని తెలిపారు. అబోడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సౌందరరాజన్ ఎస్, సంగీతం: మిక్కీ జే.మేయర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.