మసాలా
 
 
 
 
‘180’ పదేళ్ల నా కెరీర్‌లో మెచ్యూర్టీ కేరెక్టర్ : సిద్దార్థ్
‘‘అయిదారేళ్ల క్రితమైతే ‘180’ సినిమా ఒప్పుకోవడానికి ధైర్యం చేసేవాణ్ణి కాదు. ఈ సినిమా ఇప్పుడు చేయకపోతే మళ్లీ చేయలేను. పదేళ్ల నా కెరీర్‌లో ఇంత మెచ్యూర్టీ కేరెక్టర్ చేయలేదు. టైటిల్ చూసి అందరూ థ్రిల్లర్ అనుకుంటున్నారు. ఇది ప్యూర్ లవ్‌స్టోరీ’’ అని సిద్దార్థ్ చెబుతున్నారు. జయేంద్ర దర్శకత్వంలో ఆయన నటించిన ‘180’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి సిద్దార్థ్ చెప్పిన విశేషాలు.

జయేంద్ర షాకిచ్చారు
‘180’ ట్రైలర్ చూసి అందరూ షాకయ్యారు. ‘ఈ డెరైక్టర్ ఎవడు’ అని చాలామంది నన్నడిగారు. ‘ఆయన వయసు యాభై ఐదేళ్లు. నాకు గురువులాంటి వారు’ అని చెప్పాను. అంత పెద్దాయన ఇంత యూత్‌ఫుల్‌గా ఎలా తీశారని అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగానే ఆయన ఆలోచనలన్నీ యూత్‌ఫుల్‌గానే ఉంటాయి. 500కు పైగా యాడ్‌ఫిల్మ్స్ డెరైక్ట్ చేసిన జయేంద్ర సెల్ఫ్‌మేడ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఈ సినిమా హిట్టయితే జయేంద్రలాంటి ఒరిజినల్ ఫిలిమ్ మేకర్స్ చాలామంది బయటకు వస్తారు.

పోర్చుగీసు భాషలో పాట
నేను చేసిన తొలి ద్విభాషా చిత్రం ఇది. మొదట తెలుగు షాట్ తీసి, తర్వాత తమిళ షాట్ తీయడం... ఇలా ఒకే సీన్‌ని రెండు భాషల్లో చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తాయి. బ్రెజిల్‌లో కొన్ని సీన్స్ తీశాం. సహజత్వం కోసం పోర్చుగీస్‌లో ఓ పాట కూడా చిత్రీకరించాం. రెడ్ డిజిటల్ కెమెరాతో సినిమా అంతా తీశారు. రెగ్యులర్ సిద్దార్థ్ సినిమాలా ఉండదు. అప్పట్లో కె.విశ్వనాథ్, బాలూమహేంద్ర లాంటివాళ్లు తీసిన హై థాట్ ఫిల్మ్‌లాగా ప్రేక్షకుల్ని మభ్య పెట్టే సినిమా కాదు. ఓ నిజాయతీ ప్రయత్నమిది.

20 ఏళ్ల ముందు పుట్టి ఉంటే...
‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’ పెద్ద హిట్టయినా నాకు ఎందుకో చాలా రోజుల వరకూ ఆఫర్లు రాలేదు. ఇటీవల నా రెండు సినిమాలు నిరాశ పరిచినా, ఇప్పుడు నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ‘దిల్’రాజు సంస్థలో ‘ఓ మై ఫ్రెండ్’ చేస్తున్నాను. ఆ తర్వాత ‘ఆవకాయ్ బిర్యానీ’ ఫేమ్ అనీష్ కురువిల్లా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే హిందీలో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా కమిట్ అయ్యాను. నాకు నప్పే పాత్ర అయితేనే కథ ఓకే చేస్తాను. నేను ‘మగధీర’లాంటి సినిమా కోరుకుంటే వేరేలా అయిపోతుంది. నేను ఇరవైఏళ్ల ముందు పుట్టి వుంటే కె.విశ్వనాథ్, జంధ్యాలలాంటి మహానుభావులతో పనిచేసే అదృష్టం దక్కేది.