|
ఆ సినిమాకు ఎగబడ్డ ప్రేక్షక వర్గాల సంఖ్య ఇటు భారత్‌లో, అటు అమెరికాలో, యావత్ ప్రపంచ దేశాల్లో పరిశీలించినపుడు.. లెక్కకు మిక్కిలిగా ఉంది! మానవ జాతి అంతమైపోవచ్చన్న ఊహే కాసులు కురిపించేదిగా మరోసారి మారిపోయింది.
ఆ చిత్రమే 2012. అగ్నిపర్వతాలు బద్దలు కావడం, సునామీ వంటి ఉత్పాతాలు ముంచెత్తడం, భూగర్భ బంకర్‌ల వంటి వాటి ప్రస్తావన ఇందులో ఉంది. ఇప్పుడు పలువురి నోళ్లలో ఈ భూగ్రహానికి ఆపద ముంచుకు రానున్నదా అనే చర్చే నానుతోంది. వాళ్లు ఆర్థిక మాంద్యం గురించి ఆందోళన చెందడం కాసేపు మర్చిపోయారా అనేంతగా.. ఇది ఎంత తీవ్రంగా ఉందంటే, చివరకు అమెరికాలోని 'నాసా' ఈ అంశంపైన ప్రతిస్పందిస్తూ ప్రకటన చేయవలసి వచ్చింది.
ఈ నెల 13న '2012' చలనచిత్రం భారత్ సహా ప్రపంచం అంతటా విడుదల అయింది. భారత దేశంలో ఇంగ్లిషు, హిందీ, తెలుగు, తమిళ భాషలలో 676 ప్రింట్లతో 715 చిత్ర ప్రదర్శన శాలల్లో విడుదల చేశారు. తెలుగు అనువాద వెర్షన్‌కు 2012 యుగాంతం అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండేళ్ల కిందట 'స్పైడర్‌మ్యాన్-3' మన దేశంలో విడుదల అయినపుడు ఆరంభంలో (ఓపెనింగ్) రూ.19.17 కోట్లు వసూలు చేసి నెలకొల్పిన రికార్డుకు అత్యంత చేరువగా వచ్చి, రూ.19.15 కోట్లు రాబట్టింది. (గత ఏడాది రిలీజైన జేమ్స్ బాండ్ సినిమా క్వాంటమ్ ఆఫ్ సొలేస్ ఆర్జించిన రూ.17 కోట్ల కన్నా ఇది ఎక్కువ). బాలీవుడ్‌లో అగ్ర శ్రేణి సినిమాతో సమానంగా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయన్న మాట.
నిర్మాణ వ్యయం సుమారు రూ.1,222 కోట్లు:
ఈ సినిమాకు నిర్మాణానికి, ప్రచార ప్రకటనలకు, ప్రింట్లను థియేటర్లకు చేరవేయడానికి అయిన ఖర్చులు అన్నీ కలుపుకొని సుమారు 260 మిలియన్ డాలర్లు (రూపాయల్లో దాదాపు 1,222 కోట్లు) వెచ్చించి ఉంటారని ఒక అంచనా. వివిధ దేశాల్లోనూ ప్రేక్షకులు 2012 సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా తొలి 3రోజుల్లోనే 225 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,058 కోట్లు) బాక్సాఫీస్ పంట పండింది.
2012 చిత్ర దర్శకుడు రోలాండ్ ఎమ్‌రిక్ ఇదివరకు గాడ్జిల్లా, ఇండిపెండెన్స్ డే, ద డే ఆఫ్టర్ టుమారో, 10,000 బి.సి. వంటి చిత్రాలను అందించడం విశేషం. ఇవన్నీ కూడా అమిత ప్రజాదరణకు నోచుకొన్నాయి.
|