భారీ బడ్జెట్ చిత్రాలు, అంతకు మించిన భారీ కలెక్షన్స్‌తో బాలీవుడ్ స్థాయి రోజురోజుకీ పెరుగుతోంది. సంక్షోభాలు, సమస్యలతో గతేడాదంతా ఒకటీ అరా హిట్స్ తప్ప మంచి కలెక్షన్స్ కోసం ముఖం వాచిన బాలీవుడ్‌కి కళ మళ్లీ తిరిగొస్తోంది. అమీర్‌ఖాన్ తాజా చిత్రం '3 ఈడియట్స్' ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ. 240 కోట్ల కలెక్షన్లు సాధించిన 3 ఈడియట్స్ ఇప్పటికీ చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులతో కనిపిస్తోంది. దీంతో అమీర్ ఖాన్ తన గతేడాది హిట్ మూవీ గజిని రికార్డులను తిరగరాసినట్లయింది.
కలెక్షన్స్‌లో మెజార్టీ వాటా
ఇప్పటిదాకా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో గజిని అగ్రస్థానంలో ఉండేది. గజిని దేశ, విదేశీ మార్కెట్లలో మొత్తం రూ. 225 కోట్లు వసూలు చేయగా, సన్నీ డియోల్ నటించిన గదర్ సినిమా రూ. 175 కోట్ల కలెక్షన్లు సాధించింది. ధూమ్ 2 రూ. 145 కోట్లు వసూలు చేసింది. సుమారు రూ. 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 3 ఈడియట్స్ ఇప్పటికే అయిదు రెట్లు వసూలు చేసింది. 2009-10 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రిలీజైన 123 బాలీవుడ్ మెయిన్‌స్ట్రీమ్ చిత్రాలు మొత్తం మీద రూ. 1,600 కోట్లు వసూలు చేశాయి.
దీన్నిబట్టి చూస్తే 3 ఈడియట్స్ వాటా ఇందులో 15 శాతం ఉండనుంది. ఇక నెలల వారీగా నవంబర్‌లో మొత్తం బాలీవుడ్ సినిమాల దేశీయ కలెక్షన్లు రూ. 250 కోట్లు. ఇందులో అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (రూ. 60 కోట్లు కలెక్షన్లు) వంటి హిట్ చిత్రాలూ ఉన్నాయి. ఈ చిత్రాల నవంబర్ కలెక్షన్స్ మొత్తాన్నీ 3 ఈడియట్స్ పది రోజుల్లో సాధించినట్లయింది. ఈ సినిమాతో మల్టీప్లెక్స్‌లు కూడా పండుగ చేసుకుంటున్నాయి. సాధారణంగా ఏ సినిమాకైనా తొలి వారంలో కలెక్షన్లు రెండో వారంలో కనిపించవు. అందుకే షోలు కూడా తగ్గిస్తారు. కానీ రెండో వారం లో 3 ఈడియట్స్ షోల సంఖ్యను బిగ్ సినిమాస్, ఫన్ సినిమాస్ వంటి మల్టీప్లెక్స్‌లు 20% పెంచాయి.
విదేశాల్లోనూ హిట్..
ఇక అమెరికా విషయానికొస్తే.. అక్కడ షారుఖ్ ఖాన్ రికార్డులనూ అమీర్ తిరగరాశాడు. 3 ఈడియట్స్ అక్కడ 10 రోజుల్లో రూ. 22 కోట్లు వసూలు చేసింది. అదే షారుఖ్ ఓం శాంతి ఓం రూ. 17 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించగలిగింది. మొత్తం విదేశాల్లో రికార్డు చూస్తే 3 ఈడియట్స్ ఇప్పటిదాకా రూ. 45 కోట్లు సాధించింది. అంతకు ముందు ఈ రికార్డు గజిని చిత్రం పేరు మీద ఉండేది. ఇది రూ. 35 కోట్ల ఓవర్‌సీస్ కలెక్షన్స్ సాధించింది.
నవలకు పెరిగిన ఆదరణ..
చేతన్ భగత్ నవల 'ఫైవ్ పాయింట్ సమ్‌వన్' ఆధారంగా 3 ఈడియట్స్‌ను నిర్మించారు. క్రెడిట్స్ విషయంలో నిర్మాత కు, చేతన్ భగత్‌కు మధ్య వివాదం రేగింది. ఇది ఎలా ఉన్నా సినిమా పుణ్యమాని ఇప్పుడు నవలకు కూడా మరింత ఆదరణ పెరిగింది. చిత్రం రిలీజైన నాటి నుంచి నవల అమ్మకాలు 15-20 శాతం పెరిగాయని అంచనా.
|