మసాలా
 
 
 
 
ఆశా భోంస్లే గిన్నిస్ రికార్డ్
‘‘ఈరోజు ప్రపంచం మొత్తం నన్ను గుర్తించినట్లు అనిపిస్తోంది. నేనెక్కువ పాటలు పాడానని నాకు తెలుసు. కానీ ఎప్పుడూ ఆ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈరోజు ఈ రికార్డ్ మాట్లాడింది’’ అని ప్రముఖ గాయని ఆశా భోంస్లే అన్నారు. ఇప్పటివరకు ఆమె దాదాపు 18 భారతీయ భాషల్లో సుమారు 11వేల పాటలు పాడారు. వీటీలో సోలో, డ్యుయెట్, కోరస్ పాటలు ఉన్నాయి. ఉత్తమ గాయనిగా రెండు జాతీయ అవార్డులు సాధించిన ఆశా ఇంకా చాలా చాలా పురస్కారాలు వరించాయి.

తాజాగా.. ఎక్కువ పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ని సాధించారామె. ఈ సందర్భంగానే ఆశా పై విధంగా స్పందించారు. ఇంకా తన అనుభూతిని వ్యక్తపరుస్తూ -‘‘ఈ రికార్డ్ సాధించినందుకు నేను ముఖ్యంగా విశ్వాస్ నెరూర్‌కర్‌కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా. నేను పాడిన పాటల జాబితాని పరిశోధించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి సరైన సమాచారాన్ని ఇచ్చింది ఆయనే.

అందువల్లే ఈ పుస్తకంలో స్థానం సంపాదించగలిగాను’’ అన్నారు. ఇన్నాళ్లూ తన కమ్మని స్వరాన్ని వినిపించిన ఈ సుమధుర గాయని తెరపై కూడా కనిపించబోతున్నారు. ‘మాయి’ అనే చిత్రంలో నటించారామె. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆశా మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం నా పాత్ర చుట్టూ తిరుగుతుంది.

వృద్ధాప్యంలో చేయూతనివ్వాల్సిన కొడుకు నిర్లక్ష్యం చేయడంతో, కోడలు, అల్లుణ్ణి నమ్ముకుని జీవించే ఓ మహిళ కథ ఇది. ఆ మహిళగా నేను యాక్ట్ చేశాను. ఈ చిత్రం నాకు సరికొత్త అనుభూతినిచ్చింది. కచ్చితంగా ప్రతి ఒక్కర్నీ కదిలిస్తుంది. నేను మా అమ్మను మాయి అని పిలుస్తాను. ఇప్పుడు అదే పేరుతో రూపొందిన ‘మాయి’ నటిగా నా తొలి చిత్రం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.