Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
సావిత్రి మనవడు అభినయ్

     ''అమ్మమ్మ సావిత్రి తన వారసులు కూడా వెండి తెర మీద కనిపించాలని ఆశపడేదని అమ్మ చెబుతుండేది. ఆమె కోరిక నా ద్వారా తీరినందుకు సంతోషంగా ఉందని'' చెబుతున్నారు అభినయ్‌ వడ్డి. ఈ యువకుడు అలనాటి మేటి నటీమణి సావిత్రి మనవడు. దాసరి నారాయణరావు రూపొందించిన 'యంగ్‌ ఇండియా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అభినయ్‌ హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ- ''మా అమ్మ పేరు విజయచాముండేశ్వరి. చిన్నప్పటి నుంచీ నేను నటన వైపు రావాలనుకోలేదు. ఆటలంటే బాగా ఇష్టం. కొత్తవాళ్లతో దాసరి సినిమా చేస్తున్నారని తెలిశాకా సావిత్రి మనవడిగా కాకుండా నాకు నేనుగానే ఆడిషన్‌కి వెళ్లాను. ఆయన నన్ను ఎంపిక చేశాకా సావిత్రి మనవడినీ అని చెప్పాను. చాలా సంతోషించారు. యంగ్‌ ఇండియాలో నేను పోషించిన పాత్రను అందరూ మెచ్చుకుంటున్నారు. మర్యాద, క్రమశిక్షణలను దాసరి నుంచి నేర్చుకున్నాను. సావిత్రి కుటుంబం నుంచి వచ్చినవాణ్ని కాబట్టి నాపై మరింత బాధ్యత పెరుగుతుంది. అన్ని రకాల సినిమాల్లోనూ నటిస్తాను. తమిళంలో సావిత్రి కంటే జెమిని గణేశన్‌ మనవడు అనేసరికి అందరికీ బాగా తెలుస్తుంది. తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. నేను చెన్నైలో ఉండగా బన్నీ, రామ్‌చరణ్‌ అందరూ కలిసి చదువుకున్నవాళ్లమే. అమ్మమ్మ నటించిన ‘మాయాబజార్’‌, ‘రక్తసంబంధం’, ‘గుండమ్మ కథ’ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు ‘దేవదాసు’ సినిమా చాలాసార్లు చూశాను. తెలుగు, తమిళంలో కొన్ని కథలు విన్నాను. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాన''న్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005