మసాలా
 
 
 
 
నా విషయంలో జరగలేదు
ఆర్యవిద్యామందిర్‌లో చదివేటప్పుడు నేనెప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేదాన్ని. టీచర్లందరికీ నేనో తెలివైన పిల్లననే నమ్మకం. పదో తరగతిలో కూడా నేనే క్లాస్‌ఫస్ట్‌ అనుకున్నారు. కానీ... నేను ఏడోస్థానంలోనో ఎనిమిదో స్థానంలోనో వచ్చాను. ఇగో మీద పెద్ద దెబ్బ ఆ సంఘటన. జీవితంలో నేను ఏడ్చిన ఒకేఒక సందర్భం అది. ఇంటర్‌లోనూ రెండోస్థానానికే పరిమితమయ్యా. మిస్‌ఇండియా పోటీల్లోనూ అదే జరిగింది. ఆ ఏడాది మిస్‌ఇండియా నేనేనని మీడియా మొత్తం కోడై కూసింది. కానీ ఫలితం... సుస్మితాసేన్‌ ప్రథమస్థానంలో వచ్చింది. నేను సెకండ్‌ప్లేస్‌లో ఉన్నాను. అప్పటికి నెంబర్‌వన్‌ స్థానం విలువేంటో నాకు తెలిసొచ్చింది. ఆ పొరపాటు మళ్లీ జరక్కూడదనే మిస్‌వరల్డ్‌ పోటీల్లో చాలా జాగ్రత్తగా చురుగ్గా ఉన్నాను. అప్పుడు మాత్రం నేననుకున్నది సాధించానని అంటోంది ఐశ్వర్య.

ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నప్పుడు మా ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ వచ్చి ఒక మ్యాగజైన్‌ ఫీచర్‌కి వోడల్‌గా చేస్తావా అని అడిగారు. ఆమె ఫొటోజర్నలిస్ట్‌ కూడా. నా జీవితంలో వచ్చిన తొలి వోడలింగ్‌ ఆఫర్‌ అది. మొదట్లో సంకోచించాను. కానీ ఆమె ఎన్నో విధాల చెప్పి నన్ను ఒప్పించారు. నా తొలి మేకప్‌మేన్‌ భరత్‌గొడాంబే. ఆయన నన్ను చూసి వోడలింగ్‌ పరిశ్రమలో అందరికీ చెప్పేశారు. ఒకటిరెండ్రోజుల్లోనే నా గురించి ఇండస్ట్రీ మొత్తానికీ తెలిసిపోయింది. వెంటనే వరసపెట్టి అవకాశాలు. మొదట పనిచేసింది ఒక టాల్కమ్‌ పౌడర్‌ యాడ్‌కి. తర్వాత పెప్సీ యాడ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాను. ఆ యాడ్‌లో అమీర్‌ఖాన్‌తో 'హాయ్‌, అయామ్‌ సంజు' అనే డైలాగ్‌ని అభిమానులు ఇప్పటికి కూడా గుర్తుచేస్తూనే ఉంటారు. ఆ డైలాగ్‌ చెప్పడానికి నేను 19 టేకులు తీసుకున్నాను.

మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొంటున్నప్పుడే సుభాష్‌ఘయ్‌, జె.పి.దత్తా, యశ్‌చోప్రా వంటి దిగ్గజాలు తమ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం ఇస్తామన్నారు. కానీ అప్పుడు నాదృష్టంతా పోటీలపైనే ఉండటంతో ఒప్పుకోలేదు. 'బొంబాయి' సినిమాలో నన్నే హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట. ఈవిషయాన్ని తర్వాత్తర్వాత 'కండుకొండేన్‌ కండుకొండేన్‌(తెలుగులో ప్రియురాలు పిలిచింది)' సినిమా షూటింగప్పుడు ఆ చిత్ర దర్శకుడు రాజీవ్‌మీనన్‌ నాకు చెప్పారు. అలాగే సంజయ్‌లీలా భన్సాలీ తన 'ఖావోషీ' చిత్రానికి నన్ను తీసుకోవాలనుకున్నారట. అదీ తర్వాత ఆయనే చెప్పారు. అమీర్‌ఖాన్‌, కరీనాకపూర్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ 'రాజా హిందుస్థానీ' సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నాను. ఆ చిత్ర దర్శకుడు ధర్మేష్‌ దర్శన్‌ నన్ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అమీర్‌ మాత్రం నాకు స్క్రీన్‌టెస్ట్‌ చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో మిస్‌ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి రావడంతో ఆ ప్రాజెక్టు నుంచి విరమించుకున్నా.

మిస్‌వరల్డ్‌ పోటీల్లో మొత్తం 87 మంది పోటీదారులం. అందులో చాలామంది చూస్తేనే మతిపోయేటంత అందగత్తెలు. అప్పుడు కూడా నాకేమీ భయం వేయలేదు. వాళ్లను చూసినప్పుడు ఎప్పుడూ గెలుపోటముల గురించి ఆలోచనే రాలేదు. నిజంగా నన్ను భయపెట్టిందేదైనా ఉంటే అది పత్రికల్లో వచ్చిన ప్రచారమే. మొదట్నుంచీ నన్నో బలమైన పోటీదారుగా చూపారు. అది నన్ను చాలా ఒత్తిడికి గురిచేసింది.

మిస్‌వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్నాక చదువుకి తాత్కాలికంగా చుక్కపెట్టేసి ఏడాదిపాటు లండన్‌లో ఉన్నాను. ఇక్కడికొచ్చాక మీడియా హడావుడి, ప్రజల స్పందన... ఇవన్నీ చూశాక ఇక నా చదువు సాగదని అర్థమైపోయింది. దానికి తోడు హిందీ, తమిళ సినిమా రంగాల నుంచీ అత్యుత్తమ నిర్మాణ సంస్థలూ దర్శకుల నుంచి ఆఫర్ల వెల్లువ రావడంతో నామీద నాకు నమ్మకం పెరిగింది. 'సరే, ఇక ఇదే నా కెరీర్‌' అని నిశ్చయించుకుని చిత్రపరిశ్రమలోకి ప్రవేశించాను.

వెండితెరపై అరంగేట్రం... అదీ మణిరత్నం లాంటి గొప్పదర్శకుడితో... ఆ సినిమా షూటింగ్‌ మొదటిరోజు చాలా ఎంజాయ్‌ చేశాను. తర్వాత ఎన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే... నాలుగైదేళ్ల దాకా నా డైరీలో ఖాళీలు లేనంతగా. ఆ అవకాశాల వెల్లువ ఇప్పటికీ కొనసాగుతోంది. కథానాయికలకు పెళ్లయ్యాక సినిమా అవకాశాలు తగ్గుతాయంటారు. నావిషయంలో అలా జరగలేదు. ఈ ఏడాది నేను నటించిన సినిమాల(రోబో, రావణ్‌, యాక్షన్‌ రీప్లే, గుజారిష్‌) విలువ రూ.400 కోట్లు. ఇప్పటికీ వచ్చేఏడాది చివరిదాకా నా డైరీలో ఖాళీలు లేవు.