తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి తమిళ చిత్రపరిశ్రమకి చెందిన కార్మికులకు ఇళ్ల స్థలం కేటాయించారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ కరుణానిధిని భారీ ఎత్తున సన్మానించింది. ఈ వేడుకకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, అజిత్ వంటి హీరోలు, నయనతార, స్నేహ, కీర్తిచావ్లా తదితర కథానాయికలు, ఇతర సీనియర్ నటీనటులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేదికపై ప్రభుదేవా, నయనతార ఓ పాటకి నర్తించి అందర్నీ అలరించారు. స్నేహ కూడా ఓ పాటకి డాన్స్ చేశారు. మామూలుగా వేడుకలకు దూరంగా ఉండే అజిత్ పాల్గొనడమే కాకుండా కొంతమందిపై తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
"ఇటీవలి కాలంలో కొంతమంది సినిమా పెద్దలు వ్యవహరిస్తున్న తీరు పట్ల నాకు చాలా అసంతృప్తిగా ఉంది. సినిమాకి సంబంధంలేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని, కాని పక్షంలో 'బ్యాన్' విధిస్తామని బెదిరిస్తున్నారు. కావేరీ నదికి నీళ్లు విడుదల చేయకపోతే ఆ సమస్యని పరిష్కరించడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ సమస్యని సినిమావాళ్లకి ముడిపెడు తున్నారు. దానికి సంబంధించి నిరసన తెలియజేస్తూ చేసే దీక్షల్లో పాల్గొనమని ఒత్తిడి చేస్తున్నారు. సినిమా వాళ్లని సినిమావాళ్లుగా బతకనివ్వాలని కోరుకుంటు న్నాను. స్వలాభం కోసం ఎవరో చేసే పనులకు సినిమావాళ్లు బలికావడం నాకిష్టం లేదు. ఇలాంటి వేడుకలకు హాజరు కాకపోతే బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు. ఇది సబబు కాదు. ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్లని బతకనివ్వాలని కోరుకుంటున్నాను.
మాకూ రాజకీయాలకు సంబంధంలేదు దయచేసి మమ్మల్ని అందులోకి లాగకండి. ఒకవేళ ఎవరైనా ఇష్టపూర్వకంగా రాజకీయల్లోకి వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వండి. ఎవరిష్టం వారిది' అని అజిత్ ఎంతో ఘాటుగా స్పందించారు. అజిత్ ప్రసంగిస్తున్న సమయంలో రజనీకాంత్ నిలబడి మరీ తన మద్దతుని తెలియజేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అమితాబ్ బచ్చన్ కూడా అజిత్ ప్రసంగానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ - "సినిమావాళ్లని రాజకీయాల్లోకి లాగడం సరి కాదు. రాజకీయాలవల్ల సినిమా పరిశ్రమకి మేలు జరిగితే నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ సినిమా ప్రపంచాన్ని రాజకీయాల్లోకి లాగి సమస్య సృష్టించడం నాకిష్టం లేదు. అలా ఎవరైనా చేయాలని చూస్తే అది ఆమోదనీయం కాదు' అని పేర్కొన్నారు.
|