తన 50వ చిత్రం మంగాత్తాలో మాస్‌గా కనిపించిన అజిత్ తాజాగా నటిస్తున్న బిల్లా - 2లో స్టైలిష్‌గా కనిపించనున్నారట. ఈ
చిత్రం తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటానని అంటున్నారు. సినిమా ఒక్కటే జీవితం కాదని, జీవితంలో
అది ఒక భాగం మాత్రమేనని భావించే అజిత్ గురించి తెలిసిన వారు ఆయన్ను ఎక్కువగా అభిమానిస్తారు. మంగాత్తాతో
ప్రశంసలు అందుకున్న అజిత్‌తో చిన్న భేటీ...
ప్ర : మంగాత్తా ఇంత విజయం సాధిస్తుందని ఊహించారా?
జ : ఆ చిత్రం స్టోరీ లైన్ విన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాను. మరేదైనా కథ ఉంటే చెప్పమని కూడా అన్నాను.
దీంతో మా మధ్య కొంతసేపు మౌనం రాజ్యమేలింది. చిత్రం చివరి సన్నివేశం గురించి వెంకట్ ప్రభు చెప్పగానే మరో మాట
లేకుండా అంగీకరించాను. అయితే ఈ సినిమా ఇంత సంచలన విజయం సాధిస్తుందని ఊహించలేదు.
ప్ర : దీన్ని మీ 50వ చిత్రమని గుర్తుంచుకునే చేశారా?
జ : ఈ చిత్రానికి సంబంధించి చాలా విశేషాలే ఉన్నాయి. మొదటిగా చెప్పాలంటే ఈత రం యువతకు దర్శకుడు వెంకట్
ప్రభు బాగా ట్యూన్ అయ్యారు. రెండోది మంగాత్తా నా 50వ చిత్రం. మూడవది నటవర్గం. అర్జున్, త్రిష, లక్ష్మీరాయ్, అంజలి,
మరో నలుగురు యువ నటులు ఇలా చెప్పుకుంటూపోతే చాలా విశేషాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మంగాత్తా
సమష్టి కృషి.
ప్ర : అర్జున్‌ను ఎలా ఒప్పించారు?
జ : ఈ విషయంలో నేను అర్జున్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంగాత్తాలో నటించాల్సిందిగా నేను పర్సనల్‌గా అర్జున్‌ను
కోరాను. ఇది నా 50వ చిత్రమని తెలిసి అందులో తప్పకుండా నేనూ ఒక భాగమవుతానని ఆయన అన్నారు. చిత్రం
విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఏమంటారోనన్న దానికంటే అర్జున్ ఎలా ఫీలవుతారోనన్న భయం ఎక్కువగా ఉండేది.
అర్జున్ చిత్రం చూసి అభినందించారు.
ప్ర : మంగాత్తా చిత్రాన్ని అభిమానుల మధ్య చూశారా?
జ : లేదు. నిజం చెప్పాలంటే 1997లో ఉల్లాసం చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య థియేటర్‌లో చూశాను. ఆ తర్వాత
ప్రేక్షకులతో కలిసి ఏ చిత్రమూ చూడలేదు. అందుకు కారణం ఒక వేళ చిత్రం అభిమానులకు నచ్చకపోతే అక్కడ నా
పరిస్థితి చాలా హార్డ్ గా ఉంటుంది. విశేష స్పందన వస్తే హేంగోవర్ వెంటనే నా తలకెక్కుతుంది. ఈ రెండు విధానాలు
వద్దనుకుని దూరంగా ఉంటున్నా. బిల్లా-2 తర్వాత వయసుకు తగ్గ పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా.