మసాలా
 
 
 
 
హిప్ హాప్ డాన్స్ ప్రాణమంటున్న అక్షర
* 'నీకిష్టమైన పదం, పని ఏంటి?' అని ఎవరైనా అడిగితే తడుముకోకుండా ఠక్కున 'డ్యాన్స్‌' అని చెబుతా. ఎనిమిదేళ్లపుడే దాంతో నా అనుబంధం మొదలైంది. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్లు గౌతం, కోకిల నా గురువులు. బ్యాలెట్‌ తప్ప ప్రపంచంలోని అన్ని డ్యాన్సులూ నేర్చేసుకున్నా. హిప్‌హాప్‌ డ్యాన్సంటే ప్రాణం. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నా స్టేజీ మీద ప్రదర్శించే అవకాశం ఇంతవరకు రాలేదు. మీకో సంగతి తెలుసా? 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో లాటిన్‌ బాల్‌రూమ్‌ డ్యాన్స్‌ పోటీలో ఇండియా తరపున బరిలోకి దిగేది నేనే. దీనికోసం రోజూ ప్రాక్టీస్‌ చేస్తూ కష్టపడుతున్నా. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నానని అంటోంది కమల్ హసన్ కుమార్తె అక్షర హసన్.

* అప్పా (కమల్‌), అమ్మ, అక్క అందరూ నటులే. 'నువ్వూ సినిమాల్లో నటిస్తావా?' అని చాలామంది అడుగుతుంటారు. నాకు మాత్రం మొహానికి రంగులేసుకొని కెమెరా ముందు నిలబడటం ఇష్టముండదు. వెనకాల ఉంటూ 'కట్‌' చెబుతూ నేనేంటో నిరూపించుకుంటా. ఈ ప్రయత్నంలోనే ఫ్రెండ్స్‌తో కలిసి మూడు యాడ్‌ ఫిల్మ్స్‌ తీశా. మొదటిసారి 'ఫర్జానియా'కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. అందులో అమ్మ (సారిక)దే ముఖ్య పాత్ర. కొరియోగ్రాఫర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా కెరీర్‌ బాగానే ఉంది. సినిమా విషయాల్లో అవసరమైతే అమ్మ అప్పుడప్పుడు సలహాలిస్తుంది. నాన్నకి ఆ తీరికా ఉండదు. ఏదైనా అనుభవంతో తెలుసుకోవడమే నాకిష్టం. కోర్సులు చేయడం, ఇతరులను అడిగి తెలుసుకోవడం అస్సలు నచ్చవు.

* నాన్నే కాదు శృతీ ఇప్పుడు పెద్ద స్టారే. అయినా అదే ఇప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. మా మధ్య దాపరికాలేం ఉండవు. తన ప్రతి సినిమా చూస్తా. నచ్చకపోతే మొహమ్మీదే చెప్పేస్తా. మేమిద్దరం ఇంట్లో ఉంటే గందరగోళమే. అమ్మ (గౌతమి), చెల్లెలు సుబ్బులక్ష్మితో కూడా అటాచ్‌మెంట్‌ ఎక్కువ. నాన్న ఓ ఫ్రెండ్‌లా ఉంటాడు.

* నచ్చిన నగరం చెన్నై. తమిళం అంటే బోలెడు అభిమానం. ఇప్పుడు ముంబైలో ఉంటున్నా పాత రోజులు గుర్తుకొస్తే ఎంతో కోల్పోతున్నాను అనిపిస్తుంది. ముఖ్యంగా చెన్నై బీచ్‌, రోడ్లు, భాష, జనం, అక్కడి ఫుడ్‌ అన్నీ. చిన్న అవకాశం దొరికినా చెన్నైలో వాలిపోతా.