అక్షయ్ కుమార్ పేరు వినగానే ఫిల్మ్‌మేకర్స్‌కు మినిమమ్ గ్యారెంటీ అన్న నమ్మకం వస్తుంది. ఖాన్ త్రయాన్ని తట్టుకొని ప్రేక్షకున్ని థియేటర్ వరకూ తీసుకొచ్చే సత్తా అక్షరుయ్ కుమారుకుందనేది బాలీవుడ్ నమ్మకం. అయితే ఈ స్టార్‌డమ్ సంపాదించడానికి, యాక్షన్ హీరో అనిపించుకోవడానికి అతనికి 20 సంవత్సరాలు పట్టింది. 1991లో 'సౌగంధి' అనే చిత్రంతో బాలీవుడ్ ప్రవేశం చేశాడు. 24 వయస్సులో అతను చూపిన హీరోయిజానికి విజయం దక్కకపోయినా, యువతను బాగానే ఆకట్టుకున్నారు. సంవత్సరం తర్వాత అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన కాలేజ్ థ్రిల్లర్ 'ఖిలాడీ'తో సక్సెస్ రుచి చూశాడు. అక్కడ్నుంచీ ఒక్కొక్క అడుగు వేస్తూ తన స్టార్‌డమ్ పెంచుకున్నాడు. బాలీవుడ్‌కు వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు విషయాలు ఇలా పంచుకున్నారు...
* అధికారికంగా బాలీవుడ్‌లో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా. ఇన్నేళ్లు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు. నిజాయితీగా చెబుతున్నా...ఎలా స్పందించాలో కూడా తెలియటం లేదు. ఒకసారి వెనెక్కి వెళితే...ఇరవై సంవత్సరాలు ఇక్కడ కొనసాగుతానని అస్సలు ఊహించలేదు. మొదటి సినిమా స్క్రీనింగ్ చూపిద్దామని మా కుటుంబాన్ని తీసుకెళ్లాను. అమ్మానాన్న గర్వపడేలా చేయడానికి ఆ ఒక్క సినిమా చాలనే అనుకున్నా. వారి ఆనందమే నన్ను ఇంకా ఇంకా బలంగా తయారు చేసింది. మరింత కష్టపడేలా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ప్రతీ సినిమా విడుదలయ్యే సందర్భంలో వారిలో చూసిన ఆనందం ముందు, నేను పడిన కష్టాన్ని మర్చిపోతాను.
* అమృత్‌సర్‌లో పుట్టాను. పెరిగింది ఢిల్లీలో. చెఫ్‌గా బ్యాంకాక్‌లో తొలి ఉద్యోగం. ఎలాంటి సినిమా నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చాను. బాలీవుడ్‌లో ఖాన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిని తట్టుకొని నిలబడ్డాను. ఇది సామాన్య విషయం కాదు. ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో, వారికి అంత కోపం కూడా వస్తుంది. అందుకే నటనలోనే కాదు, నడవడికలోనూ జాగ్రత్తగా ఉంటాను.
* మనం మనసులో ఏం కోరుకుంటున్నామో...అదే ఇక్కడ మన లక్ష్యంగా ఉండాలి. అలా అయితేనే నటుడిగా కొనసాగగలం. అభిమానులతో అంత క్లోజ్‌గా వెళ్లే అలవాటు నాకు లేదు. ఎమోషనల్‌గా వారిని, నన్ను నేను ప్రభావితం చేసుకోవటం మంచిది కాదనేది నా అభిప్రాయం. కుటుంబ పరంగానే నటుడికి అను బంధాలుండాలని నమ్ముతా.