మసాలా
 
 
 
 
స్టార్ హీరోయిన్ అవుతా
'మైనా సినిమా తర్వాత నా జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఓ పెద్ద సంచలనమే జరిగింది. ఈ సినిమాకు ముందు నేనెవరో తెలియదు. ఒక్కసారిగా నన్నందరికీ పరిచయం చేసిన చిత్రమిది. నన్ను నాయికగా తీసుకోవటం అదృష్టంగా భావించా. నటిని అవుతానని కలలో కూడా ఊహించలే'నంటోంది మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్‌. ప్రస్తుతం తెలుగు దర్శకనిర్మాతల దృష్టి కూడా ఈమెపై పడింది. 'బెజవాడ' చిత్రంలో నాగచైతన్య సరసన చేస్తోంది. మరి తెలుగునాట తన సినీ ప్రయాణం గురించి ఇలా చెబుతోంది...

'బెజవాడ' చిత్రంలో కథానాయిక కోసం వెతుకుతున్న ప్పుడు రామ్‌గోపాల్‌వర్మ నేను నటించిన సినిమా చూశారట. అందులో నా నటన ఆయనకు బాగా నచ్చడంతో కొత్త దర్శకుడు వివేక్‌ వచ్చి నాకు కథ వినిపించారు. ఈ చిత్రంలో నా పాత్ర నిజంగా బాగుంటుంది. నటనకు ఎక్కువ స్కోపున్న రోల్‌. కొన్ని పోరాట దృశ్యాలు కూడా చేశాను. ఓ విధంగా చెప్పాలంటే కథానాయిక కూడా ఓ చిన్నసైజ్‌ రౌడీ అన్నమాట ! సాధారణ ప్రేమకథలకు పూర్తి భిన్నంగా సాగుతుంది. తెలుగులో నా కెరీర్‌కు ఊపు తీసుకొస్తుంది.

ఓ సినిమా అంగీకరించేప్పుడు కథ, కథనం, దర్శకుడు ఈ క్రమంలో నా ప్రాధాన్యత ఉంటుంది. వీటి తర్వాతే వేరే విషయాల గురించి ఆలోచిస్తాను. ఎంత అనుభవమున్న దర్శకుడైనా ఒకప్పుడు కొత్త దర్శకుడే. ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటాను. నా కెరీర్‌లో కొత్త దర్శకులతో చేసిన సినిమాలే ఎక్కువ. ఏదైనా మనం కష్టపడే తీరుపై ఆధారపడి ఉంటుంది. కథ బలంగా ఉంటే విజయం దానంతటదే వస్తుంది.

వచ్చామా...నాలుగు సినిమాలు చేశామా...కోట్లు సంపాదించామా ! అన్న పద్ధతి కానే కాదు. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. ఎప్పటికైనా స్టార్‌ హీరోయిన్‌ అవుతాననే నమ్మకం ఉంది. నేను ఎంతోమంది స్టార్‌లను చూశాను. వాళ్లు కూడా ఒకప్పుడు నా స్థాయి నుంచి వచ్చిన వాళ్లే. హిట్‌ వచ్చిందని గర్వంతో తల ఎగరేయడం, సినిమా ప్లాప్‌ అయితే కృంగిపోవడం నాకు నచ్చదు. ఉన్నతస్థానానికి ఎదగడానికి చవకబారు వ్యవహారాలు చేయటం అస్సలు చేతకాదు. జీవితంలో చాలా ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నాను. నా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సాహం వలనే నేను ఈస్థాయిలో ఉన్నాను.

నా కెరీర్‌ ఇప్పుడే మొదలైంది. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ఎప్పుడైనా మనం వెళ్లే మార్గం సరైందనే నమ్మకం ఉంటే చాలు. ఆలస్యంగానైనా గమ్యం చేరుతాం. ప్రస్తుతం నా జీవితం ఆనందంగా సాగుతోంది. గతాన్ని గర్తుపెట్టుకుంటాను. చిన్న పిల్లల్ని కష్టపెట్టినా, మహిళల్ని హింసించినా చెప్పలేనంత కోపం వస్తుంది.