పాపులర్ సింగర్ అమీ వైన్ హౌజ్ తన జీవితం ముగుస్తుందని తెలిసి చివరి రోజుల్లో తన స్నేహితులతో రోజూ
మాట్లాడారు. దాదాపు మూడు వారాలపాటు ఆమె సంవత్సరాల నుంచి మాట్లాడని స్నేహితులకు మరీ ఫోన్
చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం విశేషం. దీంతో అమీకి తన మరణం ముందే తెలుసని
సన్నిహితులు భావిస్తున్నారు.
ఉత్తర లండన్‌లోని తన ఇంట్లో సింగర్ అమీ వైన్‌హౌజ్ శనివారం మృతిచెందారు. ఆమె చివరి ఆరు రోజుల పాటు
ఉత్తర లండన్‌లోని కామ్డెన్‌లో ఉన్న తన నివాస గృహంలో రోజంతా తాగుతూ స్నేహితులతో ఫోన్‌లో
మాట్లాడుతూ గడిపారు. సంవత్సరాల పాటు మాట్లాడని కొందరితో ఆమె మాట్లాడారు.కొందరు స్నేహితులు,
మ్యూజీషియన్లకు మెసేజ్‌లు పంపి వారు ఎలా ఉన్నారని అడిగారు. ఒంటరిగా గడిపిన ఆమె చివరి రోజులను
ఇంట్లోనే గడపడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇక డ్రగ్స్‌కు బానిసగా మారిన ఆమె దాన్నుంచి
బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసింది. కానీ చివరికి 27 సంవత్సరాల వయసులోనే తనువి చాలించారు
అమీ వైన్‌హౌజ్.
ఎన్నో హిట్ పాప్ సాంగ్స్‌ను అందించిన అమీ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగించడాన్ని ఆమె అభిమానులు
జీర్ణించుకోలేకపోతున్నారు. తన సాంగ్స్‌తో తమ హృదయాల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారని వారు
అంటున్నారు. పాప్ ప్రపంచంలో అమీ ధృవతారగా నిలుస్తారని పలువురు ప్రముఖ మ్యూజీషియన్లు పేర్కొన్నారు.
ఇక జీవితపు చివరి రోజుల్లో అమీ తన సన్నిహితులతో మాట్లాడుతూ తన జీవితం ఇప్పటివరకు ఎంతో
ఆనందంగా గడించిందనీ భవిష్యత్తు గురించి నాకు బెంగ లేదన్నారు. సింగర్‌గా పలు హిట్ సాంగ్స్‌ను అందించి
అభిమానులను అలరించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. అభిమానుల ఆదరాభిమాలను
ఎన్నటికీ మరచిపోలేనని చెప్పారు.