మసాలా
 
 
 
 
వాళ్లతో నన్ను పోలుస్తున్నారు
‘‘సావిత్రి గొప్ప మహానటి అని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. ఆమె అంత కాకపోయినా... నా నటన గురించి కూడా కనీసం పదేళ్ల తర్వాత కూడా చెప్పుకోవాలి. అదే లక్ష్యంగా ముందుకు పోతున్నా’’ అంటున్నారు తెలుగమ్మాయి అంజలి. ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన ‘ఎంగేయుమ్ ఎప్పోదుం’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. ఈ సందర్భంగా అంజలి పై విధంగా స్పందించారు. ‘‘డెరైక్టర్ శరవణన్ ఈ కథ చెప్పగానే కాసేపు అదే ట్రాన్స్‌లో ఉండిపోయాను. బయటకు రాగానే... రోడ్డుపై వెళుతున్న బస్సులను చూస్తే భయం వేసింది.ప్రయాణంలో ఇన్ని సమస్యలుంటాయా? అనిపించింది. అప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... ఈ సినిమా తమిళనాట విడుదల అవ్వగానే.. చెన్నయ్ ట్రాఫిక్‌లో చాలా మార్పులొచ్చాయి. రాష్ డ్రైవింగ్ చాలావరకూ తగ్గింది. సిగ్నల్స్‌ను తప్పకుండా అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకూ నా కెరీర్‌లో బెస్ట్ సినిమా ఏంటి? అంటే.. ‘షాపింగ్‌మాల్’ అని చెబుతూ వచ్చాను. ఇప్పుడు మాత్రం ‘ఎంగేయుమ్ ఎప్పోదుం’ అనే చెబుతాను. ఈ సినిమా తెలుగులో ‘జర్నీ’గా విడుదల అవుతోంది. తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని నా నమ్మకం’’ అని చెప్పారు అంజలి.

‘‘ఈ సినిమా తర్వాత నా ఫోన్‌కి ‘ఐ లవ్యూ’ అంటూ ఎస్సెమ్మెస్‌లు వెల్లువల్లా వస్తున్నాయి. హీరో ‘జై’కి అయితే లేడీ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. పరిశ్రమలో చాలామంది సుహాసిని, రేవతి లాంటి వాళ్లతో నన్ను పోలుస్తున్నారు. డెరైక్టర్ బాలూ మహేంద్ర అయితే ఫోన్ చేసి మరీ నన్ను అభినందించారు. నటిగా నాకు అది గొప్ప పురస్కారంగా భావిస్తున్నాను. మణిరత్నం డెరైక్షన్‌లో నటించాలనేది నా లైఫ్ యాంబిషన్. ఆ కోరిక త్వరలోనే తీరుతుందని నా నమ్మకం’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు అంజలి.