మసాలా
 
 
 
 
అనువాద చిత్రాలపై ఆంక్షలేల?
తెలుగు సినిమాల (స్ట్రెయిట్) మనుగడకు అడ్డుగా నిలుస్తున్న పలు భాషలకు చెందిన అనువాద చిత్రాలపై కొన్ని ఆంక్షలు, వినోదపు పన్నులో వ్యత్యాసం అంటూ నిర్మాతలు ఇటీవల తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రదర్శనశాలల వారిలో కదలిక మొదలైంది. శనివారం విజయవాడ, తిరుపతి నగరాల్లో జరిగిన సమావేశాల్లో వారు తమ వ్యతిరేకతను వ్యక్తంజేస్తూ మాట్లాడారు. డబ్బింగ్ చిత్రాలపై ప్రభుత్వం వినోదపు పన్ను పెంచకుండా యథాస్థితిని కొనసాగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్స్ విజ్ఞప్తి చేసింది.

పన్ను పెంచితే థియేటర్లు మూతబడక తప్పదని, అపుడు వేలాది మంది రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేసింది. సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై శనివారం విజయవాడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో సమావేశం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. డబ్బింగ్ చిత్రాలపై ఆంక్షలు విధించాలని, వాటిపై వినోదపు పన్నును 20 నుంచి 50 శాతానికి పెంచాలని కొందరు సినీప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రిని కోరడంతో ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారని ఏపీ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ వీసీ హరనాథరెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి ఎగ్జిబిటర్ల సంఘం ప్రతినిధి చదలవాడ కష్ణమూర్తి మాట్లాడుతూ ఇప్పటికే నిర్వహణ భారంతో రాష్ట్రంలో అనేక థియేటర్లు మూతపడి వాణిజ్య సముదాయాలుగా మారిపోతున్నాయన్నారు. డబ్బింగ్ చిత్రాల్లో ఉండే నాణ్యత తెలుగు చిత్రాల్లో లేకపోవడం వల్లే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎం విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ డబ్బింగ్ చిత్రాలపై నిషేధం విధిస్తే తెలుగు చిత్రాల సంఖ్య ఏమన్నా పెరుగుతుందా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా ప్రతినిధి బుచ్చిబాబు మాట్లాడుతూ రకరకాల వినోద సాధనాలున్న ఈ రోజుల్లో ఒక్క థియేటర్లు మాత్రమే ఎందుకు వినోదపు పన్ను చెల్లించాలని ప్రశ్నించారు. టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ఎగ్జిబిటర్లకే ఉండాలన్నారు.

తిరుపతిలో కూడా రాష్ట్రంలోని ఎగ్జిబిటర్లంతా ఏకమై ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరేషన్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వినోదపు పన్ను ఎత్తివేతకు సూత్రప్రాయంగా అంగీకరించినా, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. డబ్బింగ్ చిత్రాలను అడ్డుకుంటే.. ప్రదర్శించే సినిమాలు తక్కువై ఎగ్జిబిటర్లు తాము చెప్పినట్లు వింటారనే ధోరణితో కొందరు నిర్మాతలున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జె.ఎన్.చౌదరి, ఆర్వీ భూపాల్‌ప్రసాద్, ఎగ్జిబిటర్లు వీ.వీరినాయుడు, కే. రామసుబ్బారెడ్డి, జీవీఎన్ బాబు, జీ నాగేశ్వరరావు, పీఎస్ భాస్కర్, బాబ్జీ, టీఎస్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.