Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
మనసు మొద్దుబారింది!

     ఆస్కార్‌ విజేత ఎ.ఆర్‌.రెహమాన్‌. రెండు ఆస్కార్‌ అవార్డులు చేజిక్కించుకుని భారతీయ సినిమా ప్రతిష్టను పెంచిన సంగీత దర్శకుడు ఆయన. ఈ నెల 11న న్యూయార్క్‌లో సంగీత కచేరి ఆరంభించి, ప్రపంచవ్యాప్తంగా మరో 19 నగరాలను సందర్శించనున్నారాయన. ఈ పర్యటనలో భాగంగా రెహమాన్‌ తను సంగీతం సమకూర్చిన పలు పాటలు పాడి శ్రోతలను అలరించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ సంగీత దర్శకులు కూడా పాలుపంచుకోనున్నారు. వచ్చే నెల 25న లండన్‌లో జరుగబోయే కచేరితో ఈ పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా రహమాన్‌ మనోభావాలు ....

ఆస్కార్‌ అవార్డ్‌ ప్రకటన విన్నప్పుడు నా మనసంతా మొద్దుబారిపోయింది. ఆ క్షణంలో నా కుటుంబ సభ్యులే నా కళ్లకు కనిపించారు. ఆస్కార్‌ సాధించిన తర్వాత నా మ్యూజిక్‌లో మార్పు వస్తుందని చాలామంది భావించారు. కానీ ఏ మార్పూ రాలేదు. కాకపోతే.. ఇప్పుడు నా పాటలు వినే వారి సంఖ్య పెరిగిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా స్వరాలు సమకూరుస్తున్నాను. ఈ అవార్డ్‌ వల్ల ఒత్తిడి పెరిగింది. కానీ ఆ ఒత్తిడి కూడా నాకు చాలా హాయిగా, ఆనందంగా ఉంది.

నేను చాలా బిజీగా ఉన్న సమయంలో వచ్చిన ఆఫర్‌ 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌'. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను ఎనిమిది చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను. ఓ రోజు ఆ చిత్రదర్శకుడు డానీ బోలే నుంచి ఓ ఇ-మెయిల్‌ వచ్చింది. "మీ పనితనం నాకు బాగా నచ్చింది. నా సినిమాకి మీరు వర్క్‌ చేస్తే నేను చాలా గొప్పగా భావిస్తాను' అన్నది ఆ మెయిల్‌ సారాంశం. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత మేం మెయిల్స్‌ ద్వారా మా మనోభావాలు పంచుకున్నాం. చివరికి ముంబయ్‌లో ఆయన్ను పర్సనల్‌గా కలిశాను. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' సినిమా చూడాలన్నాను. సినిమా చూసి, చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. దాంతో అప్పటికే నాకు వచ్చిన ఓ అవకాశాన్ని వదులుకుని ఈ చిత్రానికి వర్క్‌ చేశాను. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' సినిమా రెడీ అయిన తర్వాత మ్యూజిక్‌ చేశాను.

జీవితంలో 'మంచి మలుపులు' చాలా ఉంటాయి. 1992లో 'రోజా' రూపంలో నా కెరీర్‌కు తొలి మంచి మలుపు వచ్చింది. ఆ మలుపు నా జీవితానికి ఏకంగా 180 డిగ్రీల మలుపు అయ్యింది. ఇక ఆ తర్వాత నెలకొన్న మలుపులు అనేకం. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కాబట్టి అదో మంచి మలుపు.

స్వరానికి భాష లేదన్నది నా భావన. మంచి స్వరాలు ఇవ్వడానికి అనువుగా ఉన్న ఏ కథకు అయినా ఇష్టంగానే వర్క్‌ చేస్తా. కోలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలకు నేనెంత ఎగ్జయిట్‌మెంట్‌తో పని చేస్తానో హాలీవుడ్‌కి కూడా అలానే చేస్తాను. అంతే కానీ హాలీవుడ్‌ కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది ఉండదు.

నా పని గంటలు చాలామందికి విచిత్రంగా ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు పని మొదలుపెట్టి ఆ మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు స్వరాలు సమకూర్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిద్రపోతుంటాను. ఎక్కువగా నా టైమింగ్స్‌ ఇలానే ఉంటాయి.

ఒక సినిమా పరాజయం పాలెనప్పుడు చాలా బాధగా ఉంటుంది. సినిమా ప్రేక్షకులకు రీచ్‌ అవ్వకపోవడంవల్ల అందులో ఎంత మంచి పాటలున్నా వెలుగులోకి రావు. నా ఖాతాలో అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. కెరీర్‌ ఆరంభించిన కొత్తలో ఓ రకమైన ఉద్వేగం ఉంటుంది కాబట్టి నా పాటలు అలా మరుగున పడిపోవడం బాధ అనిపించేది. కానీ ఇప్పుడలా కాదు. ఒక సినిమా ఫెయిల్‌ అయిందని వినగానే నేను చేయబోయే తదుపరి చిత్రం గుర్తొస్తుంది. వెంటనే ఆ సినిమా కోసం పని చేయడం మొదలుపెడతాను. సినిమా విజయానికి పాటలు ప్రధాన కారణంగా నిలుస్తాయి కానీ కథలో పస లేకపోయినప్పుడు పాటలు బాగున్నా సినిమా వర్కవుట్‌ కాదు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005