మసాలా
 
 
 
 
అతని పక్కన నటించాలి
దక్షిణాదిన ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు బాలీవుడ్‌ కన్నేసిన తార ఆసిన్‌. గత నాలుగేళ్లుగా బాలీవుడ్‌పైన సీరియస్‌గా దృష్టిపెట్టింది. ఇప్పటివరకూ మూడు చిత్రాలు చేసింది. అయినా కావాల్సినంత ప్రచారం దక్కింది. చెన్నై టు ముంబారు వెళ్లినా, మధ్య మధ్య తమిళ తంబీలను నిరుత్సాహపర్చకుండా కొన్ని తమిళ చిత్రాలూ చేస్తోంది. ఈ సందర్భంగా ఆసిన్‌ చెబుతున్న కబుర్లు...

* ఇటీవలే ముంబరులో పుట్టినరోజు జరుపుకున్నా. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సాగిన ఈ వేడకను నేను మరిచిపోలేను. నాకు నేనుగా కొచ్చిలో ఆరు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చుకున్నాను. నాకు ఎక్కువగా కొచ్చిలో సమయం గడపటమంటేనే ఇష్టం.

* ప్రస్తుతం హిందీలో 'హౌస్‌ఫుల్‌-2' చేస్తున్నా. ఇంతవరకూ హాస్య తరహా చిత్రాల్ని చాలానే చేశాను. కానీ ఇది మామూలుగా ఉండదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. తాజాగా ఫరాఖాన్‌ నృత్య దర్శకత్వంలో షాజన్‌ పదమ్‌సీ, జరైన్‌ఖాన్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి నేను ఓ పాటకు నృత్యం చేస్తున్నా.

* ఇద్దరు ముగ్గురు నాయికలు ఒకే చిత్రంలో నటిస్తుంటే ఒకరంటే ఒకరికి పడదని వార్తలు వినిపిస్తాయి. కానీ మా మధ్య ఎలాంటి ఇబ్బందులూ తలెత్తడం లేదు. దర్శకనిర్మాతలు సాజిద్‌ఖాన్‌, సాజిద్‌ నదియావాలా తొలి నుంచీ నాయికల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. ఎవరికి ఏ పాత్ర ఇస్తున్నాం ! ఎంత పరిధి ఉంటుంది ! ఇవన్నీ చర్చించాకే తీసుకున్నారు. అందుకే మా మధ్య పొరపచ్ఛాలకు తావు లేదు.

* దక్షిణాదిన మల్టీస్టారర్‌ చిత్రాలు తక్కువే అని చెప్పాలి. ఎందకంటే ఒక్కో కథానాయకుడికి వారి అభిమానుల సంఖ్య బోలెడు. వారిని తృప్తి పరిచేలా కథ, కథనాలు సిద్ధమవుతాయి. ఈ పరిస్థితిలో మల్టీస్టారర్‌తో రావటం కష్టం. ఇద్దరు ముగ్గురు నాయికల్ని ఎంపిక చేయటమూ కష్టమవుతుంది. హిందీలో అలాకాదు. ఇక్కడ ఇద్దరు, ముగ్గురు హీరోలు కూడా తెరను పంచుకోవడం సహజం. అందుకనుగుణంగానే నాయికలను కూడా ఎక్కువ సంఖ్యలో తీసుకుంటారు.

* దక్షిణాదిన పెద్ద హీరోలందరి సరసనా చేశాను. కానీ రజనీకాంత్‌ పక్కన నటించాలన్న కోరిక అలానే మిగిలిపోయింది. అనేకమార్లు కలిసాను. నన్ను ప్రోత్సహించినవారిలో ఆయన కూడా ఒకరు. త్వరలో ఆయనతో ఓ సినిమాచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.