మసాలా
 
 
 
 
ముచ్చటగా మూడో ఖాన్‌ తో క్వీన్ అసిన్
లండన్‌ డ్రీమ్స్‌ చిత్రంతో అసిన్‌ పని అయిపోయిందని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేశాయి. ఇక అసిన్‌ మళ్లీ పుట్టింటికే అనుకున్నవాళ్లందరికీ అసిన్‌ సల్మాన్‌ఖాన్‌తో ‘రెడీ’ అయ్యేసరికి అంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ‘వాంటెడ్‌’, ‘దబంగ్‌’ చిత్రాల తర్వాత బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా చెలామణి అవుతున్న సల్మాన్‌ఖాన్‌తో ఉత్తరాది హీరోయిన్ల పోటీకి ఎదురొడ్డి ఛాంపియన్‌గా అసిన్‌ నిలబడింది. సల్మాన్‌ మనసు చూరగొంది. ఇదిలావుండగా ఇంతవరకూ బాలీవుడ్‌లో మహామహులైన హీరోయిన్లకే సాధ్యం కాలేనిది అసిన్‌కు సాధ్యమయింది. త్వరలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో కలిసి ‘టూ స్టేట్స్‌’ చిత్రంలో నటించే సువర్ణావశాకం అసిన్‌కు దక్కింది. వైవిధ్య చిత్రాల నటుడు అమీర్‌ఖాన్‌తో కలిసి ‘గజని’లో నటించిన అసిన్‌ సల్మాన్‌తో కలిసి ‘రెడీ’ చిత్రంలో నటిస్తోంది. ఇంకా బాలీవుడ్‌లో మూడు చిత్రాల అనుభవమైనా లేని అసిన్‌ ఇప్పుడు షారుక్‌ఖాన్‌తో కలిసి నటించే అపూర్వ అవకాశం చేజిక్కించుకోవడం సినీ వర్గాలలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌లను ఆకాశానికి ఎత్తేస్తున్న అసిన్‌ షారుక్‌ను మరింత ఎక్కువగా పొగిడేస్తోంది. షూటింగ్‌ సమయాలలో అమీర్‌ఖాన్‌ పూర్తి ఇన్వాల్వ్‌మెంట్‌ కనబరుస్తాడని...అన్ని శాఖలలో అతనికి మంచి పట్టు ఉందని అంటూ సల్మాన్‌ఖాన్‌ షూటింగ్‌ వ్యవహారాలలో అస్సలు జోక్యం చేసుకోడని... షూటింగ్‌ జరుగుతున్నంతసేపూ ఎంతో జోవియల్‌గా తోటి నటీనటులతో వ్యవహరిస్తాడంటోంది అసిన్‌. ఇప్పుడు షారుక్‌ఖాన్‌ను ఎలా పొగడబోతోందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతైనా అసిన్‌ లక్కీగాళ్‌ అని చెప్పవచ్చు. దక్షిణాదిలో దాదాపు శ్రీదేవి తర్వాత మళ్లీ అంతగా బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది.