'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కేమరన్ అందించిన మరో అద్భుత దృశ్య కావ్యం 'అవతార్' ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తొలివారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1900 కోట్లు సంపాదించి సరికొత్త రికార్డుని సాధించింది. ప్రారంభ వసూళ్ల విషయంలో టైటానిక్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్ వంటి చిత్రాలను కూడా అధిగమించిన ఈ చిత్రం 2009లో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచింది. అంతే కాదు... హాలీవుడ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ బరిలో కూడా అవతార్ ముందంజలో వుందని సమాచారం.
బెస్ట్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్... ఇలా నాలుగు విభాగాల్లో అవతార్ నామినేట్ అయ్యిందని తెలిసింది. కాగా 'అవతార్' చిత్రానికి ఇండియాలో కూడా మంచి ఆదరణ లభిస్తోందని ట్వంటీ సెంచురీ ఫాక్స్ ఇండియా ప్రతినిధి విజయ్ సింగ్ అంటున్నారు. " తొలివారంలో ఇండియాలో ఈ చిత్రం నలభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సంవత్సరం పెద్ద హిట్స్‌గా నిలిచిన బాలీవుడ్ చిత్రాల ప్రారంభ వసూళ్ల కన్నా ఈ మొత్తం అధికం.
ఆల్ టైం బాలీవుడ్ ఓపెనింగ్స్‌లో 'అవతార్' ఏడో స్థానం పొందడం విశేషం. ఒక హాలీవుడ్ చిత్రం బాలీవుడ్ చిత్రాలని మించి వసూలు చేయడమనేది ఇంతకు ముందెన్నడూ జరగలేదు. కానీ విసృత్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం... హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించడంతో ఈ చిత్రంపైన సర్వత్రా నెలకొన్న క్రేజ్ ఈ చిత్రం సంచలనాత్మక వసూళ్ళకి కారణం' అయింది అని సింగ్ తెలిపారు.
|