మసాలా
 
 
 
 
డబ్బింగ్ చెప్పమంటే ‘థ్రిల్’ అయ్యాను

‘‘సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి కనిపించడం ఓ గొప్ప అనుభూతి అయితే.. నాకిప్పటివరకు పరిచయం లేని తెలుగు భాషలో మాట్లాడటం మరో గొప్ప అనుభూతినిచ్చింది’’ అంటున్నారు అయేషా షివ్. గతవారం విడుదలైన ‘బిజినెస్‌మేన్’ని చూసినవారికి అయేషా ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాజల్ స్నేహితురాలిగా నటించిన ఈ కెనడా భామ తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకోవడం విశేషం. అయేషాకి ఇది తొలి సినిమా. కెనడాలో కొన్ని టీవీ షోస్ చేశారీమె. భారతీయ నటనలో శిక్షణ పొందడానికి ఆమె ముంబయ్ వచ్చారు.

ఆ క్షణంలో తను తెలుగు సినిమా చేస్తానని ఊహించలేదని అయేషా పత్రికలవారితో చెబుతూ -‘‘మా కాస్టింగ్ డెరైక్టర్ నన్ను పూరి జగన్నాథ్‌కి పరిచయం చేశారు. ‘బిజినెస్‌మేన్’లోని కాజల్ స్నేహితురాలి పాత్రకు సూట్ అవుతానని ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సినిమా.. భాష తెలియదు. ఎలా ఉంటుందోనని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ యూనిట్ సభ్యులు అందించిన సహకారంతో నా టెన్షన్ మొత్తం పోయింది. ఈ చిత్రంలో నా పాత్రకు తెలుగు రాదు. ఇంగ్లిష్ మిక్సి చేసి, వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతుంటాను. ఈ పాత్రకు నన్నే డబ్బింగ్ చెప్పమన్నప్పుడు ‘థ్రిల్’ అయ్యాను. తెలుగు రాదు కాబట్టి చాలా కష్టపడ్డాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది.

డబ్బింగ్ చెప్పడంవల్ల నా పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. ఇండియా వచ్చిన తర్వాత నేను చూసిన మొట్టమొదటి సినిమా ‘పోకిరి’. హీరో (మహేష్‌బాబు) అందంగా ఉన్నాడు అనుకున్నాను. సినిమా కూడా నచ్చింది. కట్ చేస్తే... మహేష్‌బాబు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇంతమంచి చిత్రం ద్వారా నా సినిమా కెరీర్ ఆరంభం కావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రంలో మీరు డబ్బున్న యువకుడికి ఆకర్షితురాలయ్యే అమ్మాయిగా నటించారు.

రియల్ లైఫ్‌లో మీరు ఏ స్టయిల్ అమ్మాయి అరి అయేషాని అడిగితే -‘‘(నవ్వుతూ)... సినిమాలో అలా చేశాను కానీ నిజంగా నేను చాలా చాలా మంచి అమ్మాయిని. జీవితానికి డబ్బు ముఖ్యం కానీ జీవితమే డబ్బు అనుకోను. ఒకవేళ నాకు ఏ కుర్రాడైనా నచ్చితే... అతను డబ్బున్నవాడా? అని మాత్రం ఆలోచించను’’ అని చెప్పారు. మహేష్‌బాబు మంచి నటుడని, ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన సహకారం మరవలేనని, కాజల్ తనని ఓ సిస్టర్‌లా ట్రీట్ చేసిందని అయేషా చెప్పారు. కెనడా, యూకెలో విడుదలైన ‘బిజినెస్‌మేన్’ని తన స్నేహితులు చూసి, చాలా బాగా యాక్ట్ చేసినందుకు ప్రసంశించారని కూడా అయేషా అన్నారు.