Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
బాధల్లో బాలీవుడ్‌

     మల్టీప్లెక్స్‌ వివాదం సమసిపోతుండగానే క్రికెట్‌.. ఎన్నికలు.. ఫలితాలు ఈ హడావిడితో మళ్లీ సినిమాలకు ప్రేక్షకులు కరవయ్యారు. ఆ తరవాత వచ్చిన స్వైన్‌ ఫ్లూ సినిమా హాళ్లు మూసేసేంత వరకూ వ్యవహారాన్ని తీసుకెళ్లింది. ఆ సమయంలో చిత్రీకరణలు కూడా వాయిదా వేసుకున్నారు. అంతలా ఈ ఏడాది స్వైన్‌ ఫ్లూ పరిశ్రమను దెబ్బకొట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే తారల పారితోషికాలు.. నిర్మాణ వ్యయం పరిశ్రమకు తీరని శోకం మిగిల్చింది. కార్పొరేట్‌ కంపెనీలు ఎంత పడితే అంత మొత్తం చెల్లించి తారలతో ఒప్పందాలు చేసుకొని చిత్రాల్ని తీయడం ప్రారంభించాయి. వారిని తట్టుకోవాలంటే సాధారణ నిర్మాతలు కూడా బడ్జెట్‌ పెంచాల్సిన అవసరం ఏర్పడింది. తీరా సినిమా విడుదలై బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడంతో ఆర్థికంగా చతికిలపడిపోయారు.

అనధికారిక లెక్కల ప్రకారం.. దాదాపు రూ.700 కోట్ల నష్టాన్ని ఈ ఏడాది బాలీవుడ్‌ మూటగట్టుకొంది. అంచనాలతో విడుదలైన సినిమాలు కూడా తల్లకిందులయ్యాయి. 'చాందినీ చౌక్‌ టు చైనా', 'అల్లాద్దీన్‌', 'కుర్బాన్‌'.. ఇలాంటి సినిమాలు విడుదలకు ముందు ఏర్పరిచిన ఆసక్తిని తరవాత నిలబెట్టుకోలేకపోయాయి. హిందీ చిత్రాల విమర్శకుడు ఒమర్‌ ఖురేషి మాటల్లోనే చెప్పాలంటే.. ''ఈ ఏడాది పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టుంది. 'బ్లూ', 'మై ఔర్‌ మిస్సెస్‌ ఖన్నా', 'దిల్‌ బోలే హడిప్పా' లాంటి భారీ చిత్రాలు సైతం నిరాశనే మిగిల్చాయ''న్నారు.

అంతంత మాత్రం: ఏడాది ప్రారంభం కావడమే 'ది ప్రెసిడెంట్‌ ఈజ్‌ కమింగ్‌', 'బ్యాడ్‌లక్‌ గోవింద్‌', 'క్వాష్‌ మేరే హోతే' లాంటి చిత్రాలతో పేలవంగా మొదలైంది. ఆ తరవాత వార్నర్‌ బ్రదర్స్‌ సహ నిర్మాణంలో వచ్చిన రూ.51 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రం.. 'చాందినీ చౌక్‌ టు చైనా', షారుఖ్‌ ఖాన్‌ సొంత నిర్మాణ సంస్థ నుంచి రూ.23 కోట్ల వ్యయంతో రూపొందిన 'బిల్లూ', రూ.45 కోట్ల నిర్మాణవ్యయంతో యూటీవీ సంస్థ నిర్మించిన 'ఢిల్లీ-6' అనుకున్న ఫలితాల్ని రాబట్టలేకపోయాయి. నిర్మాతలకు భారమయ్యాయి.

ఈ ఏడాది దాదాపు 120 చిత్రాలు హిందీలో విడుదలైతే.. అందులో విజయాల శాతం చాలా తక్కువ. ఓ మోస్తరు వ్యాపారాన్ని తెచ్చిపెట్టిన వాటిలో 'రాజ్‌-ది మిస్టరీ కంటిన్యూస్‌', 'దేవ్‌ డి', '13 బి', 'ఫూంక్‌', 'న్యూయార్క్‌', 'వేక్‌ అప్‌ సిద్‌', 'అజబ్‌ ప్రేమ్‌ కీ ఘజబ్‌ కహానీ' నిలిచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'లవ్‌ ఆజ్‌ కల్‌', 'కమీనే', 'వాంటెడ్‌' విజయాన్ని సాధిస్తే 'ఆల్‌ ది బెస్ట్‌', 'దె ధనా ధన్‌' లాంటివి కొంతలో కొంత పరిశ్రమకు వూరట కలిగించాయి.

కొన్ని సినిమాలకు మాత్రం బాగున్నాయని పేరొస్తుందిగానీ ప్రేక్షకులు వాటిని చూడటానికి ధియేటర్లకు రారు. అలాంటి జాబితాలో కొన్ని సినిమాలున్నాయి. 'లక్‌ బై ఛాన్స్‌', 'ఫిరాఖ్‌', 'గులాల్‌', 'క్విక్‌గన్‌ మురుగన్‌' లాంటి చిత్రాలు కాసులు రాల్చకపోయినా విమర్శకుల నుంచి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఏప్రిల్‌ 4 నుంచి జూన్‌ 5 వరకూ దాదాపు రెండు నెలలు మల్టీప్లెక్స్‌ వివాదం సినిమాలకు భారీ గండికొట్టింది. ఆ సమయంలోనూ కొన్ని చిత్రాలొచ్చాయి. 'కాఫీ హౌస్‌', '99', 'డిటెక్టివ్‌ నాని', 'సునో నా' చిత్రాలు విడుదలైనా సరిగా ఆడలేదు.

ఈ యేడాది చివర్లో 'పా' సినిమాతో బాక్సాఫీసు దగ్గర కాస్త సందడి నెలకొంది. భారీ బడ్జెట్‌ సినిమా 'త్రీ ఇడియట్స్‌'. అమీర్‌ ఖాన్‌ కథానాయకుడు కావడం.. కరీనాతో ముద్దులు.. ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అమీర్‌ వినూత్న పద్ధతిలో చేసిన ప్రచారం ఈ చిత్రానికి కలిసొచ్చింది. మంచి ఓపెనింగ్స్ ఈ చిత్రం సాధించింది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005