మసాలా
 
 
 
 
రీమేక్‌ల హవాలో 2012 బాలీవుడ్
గత ఏడాది మాదిరే ఈసారి కూడా బాలీవుడ్‌లో దక్షిణాది రీమేక్‌లతోపాటు సీక్వెల్ సినిమాలు థియేటర్లపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అబ్బాస్ మస్తాన్ సినిమా ప్లేయర్స్‌తో బాలీవుడ్ ఈ ఏడాది తన ప్రయాణాన్ని మొదలుపెడుతోంది.

2012లోనూ బాలీవుడ్‌లో రీమేక్, సీక్వెల్ సినిమాల హవా కొనసాగనుంది. నిరుటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దక్షిణాది సినిమాల రీమేక్‌లు, ముఖ్యంగా తెలుగు సినిమాల రీమేక్‌లు హిందీలో సందడి చేయనున్నాయి. కొత్త సంవత్సరం తొలిరోజుల్లో సినిమా విడుదల చేయడం అచ్చి రాదన్న బాలీవుడ్ నమ్మకం అపోహ మాత్రమేనని నిరుడు విడుదలైన ‘నో వన్ కిల్డ్ జెసికా’ నిరూపించింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ప్లేయర్స్ అనే భారీ బడ్జెట్ సినిమాను జనవరిలో విడుదల చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ నూతన సంవత్సరానికి శ్రీకారం చుట్టడానికి సిద్ధమైంది. 2003లో విడుదలైన సూపర్‌హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఇటాలియన్ జాబ్’ ఆధారంగా రూపొందిన ఈ హిందీ సినిమాలో అభిషేక్‌బచ్చన్, బాబీడియోల్, బిపాషా బసు, సోనమ్‌క పూర్, నీల్ నితిన్ ముఖేష్ వంటి పెద్ద తారలు నటిస్తున్నారు. థ్రిల్లర్ చిత్రాలను తీర్చిదిద్దడంలో చేయితిరిగిన అబ్బాస్-మస్తాన్ జోడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.

జనవరిలోనే విడుదల కానున్న మరో భారీ చిత్రం అగ్నిపథ్. తన తండ్రి యశ్‌జోహార్ బ్యానర్‌లో అమితాబ్‌బచ్చన్ నాయకుడిగా రూపొందిన చిత్రాన్ని కరణ్ జోహార్ కొత్త తరహాలో మరోసారి ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించే ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, సంజయ్ దత్, రిషీకపూర్ తదిత రులు ఉన్నారు. చికినీ చమేలీ ప్రత్యేకగీతంలో కత్రీనా కైఫ్ కూడా ఈ సినిమాలో ప్రేక్షకులకు కనువిందుచేయనుంది.

‘ఖోస్లాకా ఘోసా’్ల, ‘ఓయ్ లక్కీ ఓయ్’, ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించిన దివాకర్ బెనర్జీ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ ‘షాంఘై’ కూడా త్వరలో విడుదవుతోంది. నటుడిగా రాణించలేకపోయిన సంజయ్ కపూర్ నిర్మాతగా అవతారమెత్తి తీస్తోన్న సినిమా ‘ఇట్స్ మై లైఫ్’ కూడా ఈ సంవత్సరమే విడుదల కానుంది. ఇది తెలుగులో సూపర్‌హిట్టయిన బొమ్మరిల్లు సినిమాకు రీమేక్. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో హర్మన్ బవేజాకు జోడీగా జెనీలియా నటిస్తోంది. ఇవిగాక నిరుడు ‘యమ్లా పగ్లా దివానా’ తీసిన సమీర్ కార్ణిక్ ఈ సంవత్సరం ‘చార్ దిన్ కా చాందినీ’ అనే సినిమాతో, ఖాప్ సినిమా తీసిన అజయ్ సిన్హా ‘3 బ్యాచిలర్స్’తో , రూమీ జాఫ్రీ ‘గలీ గలీమే చోర్ మై’ సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటి, అంజనా సుఖానీ నసీరుద్దీన్‌షాలతో రామ్‌గోపాల్ వర్మతీస్తోన్న డిపార్ట్‌మెంట్ కూడా ఈ సంవత్సరం విడుదలయ్యే సినిమాల జాబితాలో ఉంది.

వాలెంటైన్స్ డే రోజున ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ‘ఏక్ మై ఔర్ ఏక్ తూ’ను విడుదల చేయడానికి కరణ్ జోహర్ సిద్ధమవుతున్నారు. సైఫ్ అలీఖాన్ హోప్రొడక్షన్‌లో నిర్మిస్తోన్న ఏజెంట్ వినోద్ ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. శ్రీరామ్ రాఘవన్ రూపొందించే ఈ సినిమాలో సైఫ్ పక్కన కరీనా కపూర్ హీరోయిన్. ‘తేరె నాల్ లవ్ హోగయా’ను ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నట్లు టిప్స్ కంపెనీ అధినేత కుమార్ తురానీ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో దంపతులు కాబోతున్న రితే్‌ష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఈ సినిమాలో హీరోహీరోయిన్లు.

ఏమాయ చేసావే రీమేక్ గా రూపొందుతోన్న ‘ఏక్ దివానా థా’ కూడా ఫిబ్రవరిలో విడుదల కానుంది. నాగ చైతన్య పాత్రలో ప్రతీక్‌బబ్బర్, సమంతా పాత్రలో ఎమీ జాక్సన్ దర్శనమిస్తారు. ఫిబ్రవరిలోనే విడుదలయ్యే మరో రొమాంటిక్ సినిమా ‘జోడీబ్రేక్స్’లో మాధవన్ సరసన బిపాషా బసు కనిపిస్తుంది. 1920 సీక్వెల్ ‘920 ఈవిల్‌ట్విస్ట్’, ప్రియదర్శన్ రూపొందిస్తోన్న ‘తేజ్’, అక్షయ్‌కుమార్ నటించిన‘హౌజ్‌పుల్’ స్వీక్వెల్ ‘హౌజ్‌పుల్ 2’, ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యా కూల్ హై హమ్’ సీక్వెల్ ‘క్యాసూపర్ కూల్ హై హమ్’, మరోమారు విద్యాబాలన్ హాట్‌గా కనిపించే కహానీ మార్చ్‌లో విడుదల కానున్నాయి.