మసాలా
 
 
 
 
బాలీవుడ్ లో హిట్లు - ఫట్లు
భారతీయుల జీవితాల్లో సినిమా ఒక భాగం. కొన్నేళ్లుగా ప్రేక్షకుడి అభిరుచి మారుతోంది. సినిమా విడుదలయ్యే సమయానికి వీక్షకుడి మనసుకు కనెక్ట్‌ అయ్యే చిత్రమే నిలబడుతోంది. యాక్షన్‌, డ్రామా, ఫ్యామిలీ మూవీస్‌కు గతంలో ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు ఏది ఉన్నా...లేకున్నా ఒక అంశం ఉండాల్సిందే. అది...ఎంటర్‌టైన్‌ చేయటం. సీరియస్‌నెస్‌ను ప్రేక్షకుడు ఇష్టపడటం లేదు. వందల రూపాయల ఖర్చుతో వస్తే లోకంమీద కష్టాలు మాకెందుకు అని విసుక్కుంటున్నాడు. సినిమా చూడటం ద్వారా రెండు గంటల రిలీఫ్‌ మాత్రమే కోరుకుంటున్నాడు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ప్రేక్షకుల్లో ఇదే తరహా కనబడుతోంది. తమిళంలో అజిత్‌ హీరోగా వచ్చిన 'గ్యాంబ్లర్‌', తెలుగులో వచ్చిన 'దూకుడు', మలయాళం, హిందీలో బంపర్‌ హిట్‌ కొట్టిన 'బాడీగార్డ్‌'...ఎందుకు ఆడాయంటే పెద్దగా కారణాలేం లేవు. బాలీవుడ్‌లో కూడా ఎవరి సినిమా ఎందుకు ఆడిందో విమర్శకులు చెప్పలేకపోయారు. ఈసారి ఇక్కడ సల్మాన్‌ వద్ద అదృష్ట దేవత తిష్ట వేసింది. ఆయన నటించిన చిత్రాలు కలెక్షన్ల వాన కురిపించాయి. రెడీ, దబాంగ్‌, బాడీగార్డ్‌...చిత్రాలన్నీ వంద కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. టాప్‌-5లో మూడు ఆయనవే. 2011ను ఒక విధంగా సల్మాన్‌నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2011లో బాలీవుడ్‌ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం...

ఈ సంవత్సరం హిందీ చిత్ర సీమలో 107 వచ్చాయి. తొలి త్రైమాసికంలో 21 సినిమాలు, రెండో త్రైమాసికంలో 27, మూడో త్రైమాసికంలో 38, నాలుగో త్రైమాసికంలో 21 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో మూడో త్రైమాసికంలో విడుదలైన చిత్రాల్ని అత్యధిక మంది ప్రేక్షకులు చూశారు. బాలీవుడ్‌ సక్సెస్‌ రేటు ఫరవాలేదని పించే స్థాయిలో నిలిచింది. విడుదలైన 107 సినిమాల్లో 30 సినిమాలు టాప్‌ రేంజ్‌లో ఆడాయి. ఇందులో సల్మాన్‌ఖాన్‌ నటించిన బాడీగార్డ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రాలు... బాడీగార్డ్‌, రెడీ, రా.వన్‌, సింగం, జిందగీ నా మిలేగీ దోబారా, మర్డర్‌ 2, మేరీ బ్రదర్‌ కి దుల్హన్‌, ఢిల్లీ బెల్లీ, యామ్లా పాగ్లా దీవానా, తను వెడ్స్‌ మను. ఓ మోస్తరు కలెక్షన్లు అందుకున్నవి... డబుల్‌ ధమాల్‌, థాంక్యూ, ఫాల్తూ, దోబీఘాట్‌, దిల్‌ తో బచ్చా హై జి, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా, చలో ఢిల్లీ, సాహెబ్‌ బీవీ అవుర్‌ గ్యాంగ్‌స్టర్‌, ముఝే ఫ్రండ్షిప్‌ కరోగీ, ప్యార్‌ కా పంచనామా, యేV్‌ా సాలీ జిందగీ.

టాప్‌ మూవీ 'బాడీగార్డ్‌'...
2011 సల్మాన్‌ కెరీర్‌లో గుర్తిండిపోయే సంవత్సరం. ఇతను నటించిన' రెడీ', 'దబాంగ్‌', 'బాడీగార్డ్‌' మూడూ భారీ విజయాన్ని అందుకున్నాయి. వంద కోట్ల రూపాయలకు మించి వసూలూ చేసిన చిత్రాల్లో సల్మాన్‌ వాటా నాలిగింట మూడొంతులు. ఆయన నటించిన 'బాడీగార్డ్‌' అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ముందుంది. 140,95,00,000 రూపాయలు కలెక్ట్‌ చేసింది. రూ.85.50 కోట్లు మొదటి వారంలో కలెక్ట్‌ అయ్యాయి. ఆల్‌టైం రికార్డ్‌ కలెక్షన్లలో 'బాడీగార్డ్‌'కు రెండో స్థానం దక్కింది. మొదటి స్థానం 2009లో విడదలైన 'త్రీ ఇడియట్స్‌' పేరిట ఉంది. సల్మాన్‌ మరో చిత్రం 'దబాంగ్‌' కూడా విడుదలైన తొలిరోజు అత్యధిక వసూళ్లు అందుకుంది. 100 కోట్ల మార్క్‌ దాటింది. సల్మాన్‌ మరో చిత్రం 'రెడీ' 121,25,00,000 రూపాయలు వసూలు చేసింది. చరిత్రలో అత్యధిక కలెక్షన్లు అందుకున్న నాలుగో చిత్రం 'రెడీ'. ఈ సంవత్సరం టాప్‌-4లో మొదటి మూడు స్థానాలు సల్మాన్‌ కొట్టేయగా, నాలుగోస్థానం షారక్‌ నటించిన 'రా.వన్‌' దక్కించుకుంది. ఈ చిత్రం 114,74,00,000 రూపాయలు వసూలు చేసింది. ఆల్‌టైం రికార్డ్‌ కలెక్షన్స్‌లో ఐదో స్థానం. ఒకరోజు కలెక్షన్లలో' బాడీగార్డ్‌' రికార్డ్‌ను తుడిచేసి, 22.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

2011 సంవత్సరంలో టాప్‌-5 మూవీ అజరుదేవ్‌గన్‌ నటించిన 'సింగం'. 97,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఆల్‌టైం రికార్స్‌లో ఎనిమిదో స్థానం. కథానాయకుల విషయంలో ఈ సంవత్సరాన్ని సల్మాన్‌నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు. 2010 సల్మాన్‌ను ఎంత నిరాశపర్చిందో అంతకు వందరేట్లు ఈ సంవత్సరం సంతోషపెట్టింది. ఆయన నటించిన రెడీ, బాడీగార్డ్‌...మూడు చిత్రాలూ ఓరిజినల్‌గా దక్షిణాదివే. మన తెలుగు చిత్రం 'రెడీ'ని అదే పేరుతో సల్మాన్‌ హిందీలో చేశాడు. దబాంగ్‌ హిందీలో స్ట్రెయిట్‌ మూవీ అయినా, అందులో చూపిన రుచులన్నీ దక్షిణాదివే. మలయాళ సినిమా బాడీగార్డ్‌ను అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. కథ, స్క్రిప్ట్‌...తొక్కాతోళు..అన్న కష్టం లేకుండా ఈ సంవత్సరం సల్మాన్‌ భారీ విజయాల్ని నమోదు చేసుకున్నాడు. కథ, స్క్రిప్ట్‌ కోసం ఎన్నో నెలలు, సంవత్సరాలు వెచ్చించే కన్నా, ప్రాంతీయ చిత్రాల్లోని ఓ హిట్‌ స్టోరీని పట్టేస్తే పోలా ! అన్న నిర్ణయానికి బాలీవుడ్‌ ఫిలీం మేకర్స్‌ వచ్చేశారు.

* కథానాయికల విషయానికొస్తే...ప్రియాంకా చోప్రా, కరీనాకపూర్‌, కత్రినాకైఫ్‌ అగ్రస్థానం కోసం పోటీ పడ్డారు. కానీ ఇందులో అదృష్టం మాత్రం కరీనీకపూర్‌నే వరించింది. వరుసగా నాలుగు చిత్రాలు టాప్‌ కలెక్షన్లు సృష్టించాయి. నటనలో ప్రియాంకా చోప్రా ముందున్నా తగిన ఫలితం దక్కలేదు.

* విచిత్రమేమంటే ఈ సంవత్సరం ప్రేక్షకుల మైండ్‌సెట్‌ దేశవ్యాప్తంగా ఓకేరీతిగా ఉంది. దక్షిణాదిన చూసినా, ఉత్తరాదిన చూసినా సీరియస్‌, హిస్టారికల్‌ మూవీస్‌కు అంతగా ఆదరణ లభించలేదు. తర్కం లేకున్నా, అసలు కథంటూ లేకున్నా, ఊహించని మలుపులు, ఉత్కంఠత లేకున్నా...ఫరవాలేదు. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉందా ! లేదా ! అన్నదే ప్రేక్షకుడు లేక్కేసుకున్నాడు. సినిమా అనేది రిలీఫ్‌ అన్న భావనకే ప్రాధాన్యతనిచ్చాడు.' నో వన్‌ కిల్డ్‌ జెస్సికా', '7 ఖూఫ్‌ మాఫ్ ',' గేమ్‌', 'దమ్‌ మారో దమ్‌', 'ఐ యామ్‌ ఖాన్ ', 'అరక్షన్‌'...సినిమాల్లో కన్విన్సింగ్‌ స్టోరీ ఉన్నా, పట్టించుకోలేదు. 2011 టాప్‌-5 మూవీస్‌ను పరిశీలిస్తే... 'బాడీగార్డ్‌', 'దబాంగ్‌', 'రెడీ', 'రా.వన్‌', 'సింగం'...వీటిల్లో కామన్‌ అంశం...యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.

* 'రా.వన్‌', 'జిందగీ నా మిలేంగీ దోబారా', 'బాడీగార్డ్‌' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రాబట్టుకున్నాయి.' ఢిల్లీబెల్లీ',' మర్డర్‌ 2 'చిత్రాలు విజయాన్ని సాధిస్తాయని ఎవరూ ఊహించలేదు. మొత్తంగా 2011 సంవత్సరం టాప్‌-10 మూవీస్‌ వసూళ్లు 865.64 కోట్ల రూపాయలు. ఇందులో విదేశాల్లో వచ్చింది. 16.4 కోట్ల డాలర్లు. గత సంవత్సరం కన్నా ఇది 17.76 శాతం ఎక్కువ. ఇక డిసెంబర్లో వచ్చిన 'డర్టీ పిక్చర్‌' అనూహ్యమూన కలెక్షన్లు అందుకుంది. ఇప్పటివరకూ దాదాపు 80 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్‌ చివర్లో షారూక్‌' డాన్‌-2' వచ్చింది . 'రా.వన్‌'ని మించిన ఓపెనింగ్స్ దీనికి వచ్చాయి. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నందున ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి .