Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
అంతా 'బహ్మి'మయం!

      ఒక నటుడు ప్రజాదరణ పొందడం, సుదీర్ఘకాలం కొనసాగడం అన్నది... ఏ కొద్దిమంది విషయంలోనో సాధ్యపడుతుంది. దాదాపు వెయ్యి చిత్రాలు పూర్తి కావస్తున్నా ప్రేక్షక ఆదరణ రోజు రోజుకీ పెరగడం అన్నది కేవలం బ్రహ్మానందం విషయంలోనే సాధ్యమయ్యింది. సినిమాలో ఎంత పెద్ద హీరో ఉన్నప్పటికీ, ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మానందం తప్పనిసరి - అనేది ప్రస్తుతం మన సినిమావారి ఆలోచన. గత రెండు మూడేళ్ళుగా చూస్తే చాలా సినిమాలు విజయవంతం కావడానికి బ్రహ్మానందం ప్రధాన కారకుడిగా నిలిచారు. ఇటీవల వచ్చిన 'కాస్కో', 'అదుర్స్‌', 'నమోవెంకటేశ', 'సీతారాముల కళ్యాణం' వంటి చిత్రాల్లోనూ అతనిదే కీలక పాత్ర. వీటిలో వసూళ్ళపరంగా ముందంజలో ఉన్న 'అదుర్స్‌', 'నమో వెంకటేశ' చిత్రాలవారు తమ చిత్రాల ప్రచారం కోసం పోటాపోటీగా బ్రహ్మానందంతో ప్రెస్‌మీట్‌లు పెట్టించారు. వాటిలో వెలిబుచ్చిన 'బ్రహ్మి' భావాలు చదవండి...

ప్రతిభ కంటే అదృష్టం గొప్పది
''మామూలుగా ఎవరైనా అద్భుతాలను కనిపెడతారు. ఈ మధ్య ఓ చిన్నారి వాళ్ళ నాన్నతో 'నాన్నా, బ్రహ్మానందాన్ని ఎవరు కనిపెట్టారు?' అని అడిగాడట. నా గురించి నేను విన్న అత్యుత్తమ భావ ప్రకటన ఇది'' అని బ్రహ్మానందం పేర్కొన్నారు. ''నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ వూహించుకోలేదు. నా ముందున్న కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ పోయానంతే. విజయాల్ని ఆనందించాను. ఓటమి వచ్చినప్పుడు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాను. నాలో ఉన్న ప్రతిభ కన్నా నాలోని అదృష్టం గొప్పది. అందుకే ఇన్ని దశాబ్దాలైనా యువ దర్శకులు కూడా నన్ను కొత్తగా చూపించగలుగుతున్నారు. ప్రజల్ని మెప్పిస్తున్నారు. అదంతా నా అదృష్టం. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాను. వారి హావభావాలను గుర్తిస్తాను. అందుకే పాత్రలో సులభంగా ఒదిగిపోగలుగుతున్నాను. సగటు మనిషి నన్ను చూడగానే ఒక్క క్షణం ముఖకవళికలను ఆనందంగా మారుస్తున్నాడంటే హాస్య నటుడిగా అంతకన్నా ఆనందం మరేముంది?'' అన్నారు. నమో వెంకటేశ గురించి చెబుతూ ''నేనూ, వెంకటేష్‌ శరీరమంతా నూనె పూసుకుని తిరిగే సన్నివేశం ఒకటుంటుంది. అదంటే నాకు చాలా ఇష్టం. ఆ సన్నివేశాన్ని దాదాపు 15 రోజులు చేశాం. దర్శకుడు శ్రీను వైట్ల నా పాత్రను తీర్చిదిద్దే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే షాట్‌లో తను ఎలా చెప్తే అలాగే నటిస్తాను. అందువల్ల నాలోని నటన మరింత వైవిధ్యంగా కనిపిస్తుంద''న్నారు.

ఇగోలు పక్కన పెట్టాలి!
''నేను ఫలానా.. నా ప్రవర్తన ఇంతే.. అని అనుకుంటే పాత్రలు పండవు. నటీనటులు తమకున్న భుజకీర్తుల్ని పక్కనపెడితేనే చేస్తున్న పాత్రలో లీనం కాగలరు. లీనమై చేస్తేనే పాత్రకు మంచి పేరు వస్తుంది'' అని అంటున్నారు బ్రహ్మానందం. భట్టాచార్య పాత్రలో 'అదుర్స్‌'లో ఆయన నవ్వించారు. గురువారం ఉదయం బ్రహ్మానందం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. 'సినిమా చూసినవారే కాదు.. షూటింగ్‌ సమయంలో మేం కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నామ'ని ఆయన విలేఖరులతో చెప్పారు. ''ఇంతకుముందు పలు సందర్భాల్లో పురోహితుడి పాత్రలో నటించినా 'అదుర్స్‌'లో భట్టాచార్య పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆహార్యంలో చాలా మార్పులు కనిపించాయి. నామాలు, పంచెకట్టు.. ప్రతి విషయంలోనూ దర్శకుడు వినాయక్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. 'అదుర్స్‌'లో నేను చెప్పే డైలాగుల్లో పంచ్‌ ఎక్కువగా ఉంటుంది. 'తెల్లార్లు..' అంటూ ఎన్టీఆర్‌తో డైలాగ్‌ చెప్పే సన్నివేశం ఒకటుంటుంది. ఆ సన్నివేశం చేయడానికి దాదాపు 22 టేకులు తీసుకున్నాం. నేను డైలాగ్‌ను మొదలుపెట్టడం.. ఎవరో ఒకరు నవ్వడం. ఇదీ వరస. అంత సరదాగా షూటింగ్‌ చేశాం. అలాగే హీరోయిన్‌కు నేను బీట్‌ వేసే సన్నివేశాలు 'పోకిరి' నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తరహా పాత్రలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నార''న్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005