Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
షాక్‌ తిన్న జేమ్స్‌ కామరూన్‌

      'టైటానిక్‌' దర్శకుడు జేమ్స్‌ కామరూన్‌కి ఆయన మాజీ భార్య కాత్రిన్‌ బిగెలో పెద్ద షాక్‌ ఇచ్చారు. వివరంగా చెప్పే ముందు కాత్రిన్‌ బిగెలో గురించి కొంచెం చెప్పాలి. బిగెలో వయసు ఇప్పుడు 58. ఆ వయసు శరీరానికే తప్ప మనసుకి మాత్రం కాదంటారామె. 1978లో 'ది సెట్‌-అప్‌' అనే 20 నిమిషాల లఘు చిత్రం ద్వారా ఆమె దర్శకురాలయ్యారు. అనంతరం 'ది లవ్‌లెస్‌' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దర్శకురాలిగా కొనసాగుతూ విజయాలు చవి చూస్తున్నారు. దర్శకుడు జేమ్స్‌ కామరూన్‌ని 1989లో పెళ్లాడారామె. ఈ ఇద్దరి వైవాహిక జీవితం మూడేళ్ల పాటు వైభవంగా సాగి ఆ తర్వాత విడాకులకు దారి తీసింది. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు.

ఇక మాజీ భర్త కామరూన్‌కి బెగిలో ఇచ్చన ఝలక్‌ విషయానికొద్దాం. ఈ నెల 21న లండన్‌లోని రాయల్‌ ఒపెరా హౌస్‌లో 'బాఫ్తా' అవార్డ్స్‌ వేడుక జరిగింది. ఈ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుల విభాగంలో జేమ్స్‌ కామరూన్‌, కాత్రిన బిగెలో పోటీపడ్డారు. ఇంకా ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే... ఇలా వివిధ విభాగాల్లో కామరూన్‌ దర్శకత్వం వహించిన 'అవతార్‌', బిగెలో దర్శకత్వంలో రూపొందిన 'ది హర్ట్‌ లాకర్‌' చిత్రాలు పోటీపడ్డాయి. మొత్తం ఎనిమిది విభాగాల్లో ‘ది హర్ట్‌ లాకర్‌’ నామినేషన్‌ పొందగా ఆరు అవార్డులు కైవసం చేసుకుంది. 'అవతార్‌' చిత్రానికి కూడా ఎనిమిది విభాగాల్లో నామినేషన్‌ లభించినప్పటికీ రెండే రెండు అవార్డులు దక్కాయి. అది కూడా ప్రొడక్షన్‌ డిజైన్‌, స్పెషల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌కి అవార్డులు లభించాయి. ఉత్తమ దర్శకుడి అవార్డు కామరూన్‌కే అని చాలామంది ఊహించారు. అయితే బిగెలో ఆయన్ని ఓడించడంతో పాటు ఆమె దర్శకత్వంలో రూపొందిన చిత్రానికి ఏకంగా అరడజను అవార్డులు రావడం కామరూన్‌ని షాక్‌కి గురి చేసిందట. ప్రపంచవ్యాప్తంగా 'అవతార్‌' అత్యధిక వసూళ్లు కురిపించిన చిత్రంగా నమోదైంది. అయితే అవార్డులు మాత్రం రెండే దక్కించుకోగలిగింది. ఇదిలా ఉంటే ఆస్కార్‌ బరిలో కూడా 'అవతార్‌', 'ది హర్ట్‌ లాకర్‌' చిత్రాలు పోటీపడుతున్నాయి. మరి.. ఆస్కార్‌ రేస్‌లో ఏ చిత్రానికి ఎన్ని అవార్డులు దక్కుతాయో వేచి చూడాల్సిందే.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005