భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేసే వి.కె.జైట్లీ అక్కడే సైకాలజిస్టుగా పనిచేస్తున్న అఫ్గానిస్థాన్ యువతి మీఠాతో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు ప్రతిరూపంగా 1981 నవంబర్ 24న కాబూల్‌లో సెలీనా పుట్టింది.
ఆమె పేరెంట్స్‌తోపాటు సోదరుడూ ఇండియన్ ఆర్మీకి సేవలందించిన వాళ్లే. వాళ్ల బాటలోనే తనూ సైన్యంలో డాక్టర్ లేదా పైలట్ కావాలని కలలు కనేది. కానీ తండ్రి ఉద్యోగరీత్యా దేశమంతా తిరగడంతో చదువు సరిగా సాగలేదు సరికదా ఆశ అటకెక్కింది. ఎలాగో కష్టపడి డిస్టెన్స్‌లో బీకామ్ పూర్తిచేసిందనుకోండి! 2001లో కోల్‌కతాలో జరిగిన ఓ అందాల పోటీల్లో సరదాగా పాల్గొని విజేతగా నిలిచింది. ఆపై దృష్టి అందంపై పడింది. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలకు తయారైంది. మిస్ ఇండియాగా కిరీటం దక్కించుకున్నా, మిస్ యూనివర్స్ కొద్దిలో తప్పిపోయింది. అయితేనేం? బాలీవుడ్ కంట్లో పడింది. ఫలితంగా 2003లో 'జానాషీన్' సినిమాతో తెరంగేట్రం చేసింది.
ఇండస్ట్రీకొచ్చి ఆరేళ్లే అయినా అప్పుడే 20 సినిమాలు పూర్తి కానిచ్చేసింది. విష్ణు సరసన సూర్యం అనే ఓ తెలుగు సినిమాలోనూ మెరిసింది. హాలీవుడ్ సుందరాంగులకు ఏమాత్రం తీసిపోని అందగత్తె కావడంతో విదేశీ అవకాశాలొచ్చాయి. 'లవ్ హాజ్ నో లాంగ్వేజ్' అనే న్యూజీలాండ్ సినిమాలో నటనకి కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ యేడు ఉత్తమ నటిగా నిలిచింది. ఈ సంతోషం నుంచి తేరుకోకముందే జేమ్స్‌బాండ్ సూపర్‌హీరో సీన్ కానరీ సరసన పర్షియా రాకుమార్తెగా నటించే అవకాశం దక్కింది. ఈనెల్లోనే విడుదలవుతున్న 'యాక్సిడెంట్ ఆన్ హిల్‌రోడ్' అనే సస్పెన్స్ థ్రిల్లర్‌లో సెలీనా వెరైటీ గెటప్‌తో అలరించనుంది.
గేలకు సమాన హక్కులుండాలంటూ బాలీవుడ్‌లో గళమెత్తుతున్న ఏకైక నటి ఈవిడేమరి. 2008లో ముంబైలో జరిగిన గే పరేడ్‌లో పాల్గొని తన మద్దతు తెలిపింది. ముంబై నుంచి వెలువడుతున్న 'బాంబే దోస్త్' అనే మొదటి గే మ్యాగజైన్‌లో వాళ్ల తరపున వకల్తా పుచ్చుకొని వ్యాసాలు రాస్తోంది. హిజ్రాలంతా కలిసి ముచ్చటగా థానేలో నిర్వహించిన 'సూపర్ క్వీన్' అందాల పోటీలకు జడ్జిగా సేవలందించింది.
|