తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ‘చంద్రముఖి’ ఆత్మ నీడలా వెంటాడుతోందా? ఆయన వాలకం చూస్తుంటే అలానే అనిపిస్తున్నది. ఎడతెగకుండా రజనీకాంత్ గుళ్లు గోపురాలు తిరు గుతున్నారు. అంతేకాదు హోమాలు, యాగాలు చేస్తున్నారు. ఏకంగా మృత్యుంజయ హోమం చేయించారు. కన్నడ నటుడు విష్ణువర్ధన్ రెండు నెలల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి రజనీకాంత్ మరీ డీలా పడిపోయారు. విష్ణువర్ధన్ రజనీకి ఆప్త మిత్రుడు. ఆ దిగులు ఒకటైతే, విష్ణువర్ధన్ మరణం గురించి ఆయన చెవులకు సోకిన కథ మరింత గాభరా పెడుతోంది.
రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను అంతకు ముందే కన్నడంలో ‘ఆప్తమిత్ర’ పేరు మీద తీశారు. అందులో విష్ణువర్ధన్, సౌందర్య నటించారు. 2004లో ఆ సినిమా విడుదలకు ఒక నెల ముందు సౌందర్య చనిపోయారు. ఇటీవలే విష్ణువర్ధన్ కూడా చనిపోయారు. కన్నడ సినిమాలో ‘నాగవల్లి’ ఆత్మ వాళ్లిద్దర్నీ మింగేసిందని సినీ పరిశ్రమలో ప్రచారం మొదలైంది. తమళ సినిమాలో విష్ణువర్ధన్ పాత్రని రజనీ పోషించారు. ఇకనేం రజనీకి భయం పట్టుకుంది.
రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి జనవరి మైసూర్‌లోని చారిత్రాత్మకమైన లలితామహల్ ప్యాలెస్ హోటల్‌లో రెండు రోజుల పాటు బస చేశారు. రజనీ పలు దేవాలయాలు సందర్శించీ పూజలు నిర్వహించారని కూడా ఆయన తెలిపారు. కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుడొకరు పూజా కార్యక్రమాలన్నీ రజనీ వెంట ఉండి జరిపించారట. విష్ణువర్ధన్ మృతి చెందిన తర్వాత రజనీ చాలా దిగులుగా ఉన్నారని, ఆయన సన్నిహితుల సలహా మేరకే మైసూర్‌లోని ప్రసిద్ధ శివుని దేవాలయం, నర్సిపూర వద్ద ఉన్న తిరుమాకుడాల్ గుడిని సందర్శించారని చెబుతున్నారు.
ప్రముఖ దర్శకుడు పి.వాసు ‘ఆప్తమిత్ర’కు సీక్వెల్ ‘ఆప్తరక్షక’ను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా నటించమని వాసు రజనీని కోరగా ఆయన తిరస్కరించారు. కారణం బహిరంగ రహస్యమే. ‘ఆప్తరక్షక’ చిత్రం ఈ వారం విడుదలయ్యింది. విష్ణువర్ధన్ మరణానికి ఒక నెల ముందే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో ఆయన కథానాయకుడు, ఇది ఆయన 200వ చిత్రం. ఈ షూటింగ్ సమయంలో తనకు తెలియని ఏదో కొత్త అను‘భూత్’లకు లోనయ్యానని విష్ణువర్ధన్ చెప్పారట.
|